భైంసా: నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 6న సీఎం రేవంత్‌రెడ్డి బాసర పర్యటనలో జిల్లాకు రెండు యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ఒకటి నిర్మల్ నియోజకవర్గానికి కాగా, మరొకటి ముధోల్ నియోజకవర్గానికి కేటాయించారు. ముధోల్‌లో కంటి ఆస్పత్రి వద్ద నిర్మల్ నియోజకవర్గంలో సిర్హాపూర్ వద్ద పాఠశాల భవన నిర్మాణాలు చేపట్టనున్నారు.
ఒక్కోదానికి రూ.200 కోట్లు
ఒక్కోయంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం దానికి రూ.200 కోట్లు కేటాయించింది. భవన నిర్మాణాలు పూర్తి చేసి ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఒకే క్యాంపస్‌లో సమీకృత విద్య అందుబాటులోకి తేనుంది. ఆధునిక సదుపాయాలతో కూడిన భవనాలు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్స్, క్రీడా వసతులు తదితర సదుపాయాలు కల్పించనుంది. నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఈ పాఠశాలలు ఎంతో ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవడం, భవిష్యత్‌లో ఉన్నత విద్యావకాశాలు పొందడం లాంటి అంశాల్లో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. స్కూళ్ల ఏర్పాటు నిర్ణయంపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేట్‌గా దీటుగా..
కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ఈ స్కూళ్లలో బోధన ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంతో పోటీ పడేలా సిలబస్ రూపొందిస్తామని తెలిపింది. 25ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భవనాలు నిర్మించి డిజిటల్ విద్య అందించేలా కార్యాచరణ రూపొందించింది. ఒక్కో సమీకృత గురుకుల పాఠశాల క్యాంపస్‌లో విద్యార్థులకు అవసరమయ్యే ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, క్రీడా ప్రాంగణం తదితర వసతులు ఉండేలా డిజైన్ చేసింది. ఒక్కో లైబ్రరీలో 5వేల పుస్తకాలు, 60 కంప్యూటర్లు, తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయనుంది. 900 మంది విద్యార్థులు ఒకేసారి కూర్చుని భోజనం చేసేలా డైనింగ్‌హాల్ నిర్మించనుంది. విద్యార్థులు ఉపాధ్యాయులకు రెసిడెన్షియల్ క్యాంపస్, ప్రతి డార్మెటరీలో 10 బెడ్లు, రెండు బాత్‌రూమ్‌లు, గ్రీన్ క్యాంపస్, సోలార్, విండ్ ఎనర్జీ తదదితర సదుపాయాలు కల్పించనుంది.
పేద పిల్లలకు వరం
ఈనెల 6న బాసర పర్యటన సందర్భంగా జిల్లాకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు. సరిహద్దుకు ఆనుకుని ఉన్న ముధోల్ నియోజకవర్గంలో కార్పొరేట్ చదువులు అందనున్నాయి. నిరుపేద కుటుంబాల్లోని పిల్ల లకు ఇవి వరంగా మారనున్నాయి.
– పవార్ రామారావు పటేల్, ముధోల్ ఎమ్మెల్యే


