భైంసాటౌన్: పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉంది. సరిపడా ఉద్యోగులున్నా పలువురు డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో ఉన్నవారిపైనే అధిక భారం పడుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ టీచర్లు, ఆయాల కొరత ఉంది. టీచర్లు లేనిచోట ఆయాలతో నెట్టుకొస్తుండగా, ఇద్దరూ లేనిచోట ఇబ్బందులు నెలకొన్నాయి. భైంసా ఐసీడీఎస్ పరిధిలో భైంసా, కుభీర్, కుంటాల మండలాలున్నాయి. వీటి పరిధిలో 205 అంగన్‌వా డీ కేంద్రాలుండగా 20 టీచర్ పోస్టులు, 86 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భైంసాలోని ఐసీడీఎస్ కార్యాలయాన్ని ఇద్దరితోనే నెట్టుకొస్తున్నారు. సీడీపీవో ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తుండగా, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లు డిప్యూటేషన్‌పై నిర్మల్‌కు వెళ్లారు. సీనియర్ అసిస్టెంట్‌ను ముధోల్ ఐసీడీఎస్ నుంచి డిప్యూటేషన్‌పై కేటాయించినా, వి ధులకు సక్రమంగా హాజరు కావడం లేదు. దీంతో ప్రస్తుతం భైంసా ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీవో, బ్లాక్ కోఆర్డినేటర్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్య అందించడం, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలుచేసే బాధ్య త టీచర్లపై ఉంటుంది. పోస్టులు ఖాళీ ఉండడంతో ఆశించిన స్థాయిలో లక్ష్యం నెరవేరడం లేదు.


