1857–60 మధ్య జరిగిన రాంజీగోండు పోరాటం, ‘వెయ్యి ఉరులమర్రి ఘటన’లను తెలంగాణ తొలి స్వాతంత్య్ర పోరాటంగా చెప్పుకోవచ్చు. అప్పటి జనగామ (ఆసిఫాబాద్) పాలకుడైన మర్సుకోల రాంజీగోండు తన బలగంతోపాటు తనకు అండగా వచ్చిన రోహిల్లాలను కలుపుకొని పోరాటం చేశాడు. అప్పటి నిర్మల్ కలెక్టర్ ఆగడాలపై దాడి చేసేందుకు అక్కడి నుంచి వచ్చాడు. సామాన్య ‘గిరి’పుత్రులతో, సంప్రదాయ ఆయుధాలతోనే ఆంగ్లేయ–నైజాం సేనలను గడగడలాడించాడు. రాంజీసేనను ఓడించేందుకు ఏకంగా బళ్లారి నుంచి అదనపు బలగాలను రప్పించారు. దొంగ దెబ్బతీసి వారిని పట్టుకున్నారు. ఇకముందు తమకు ఎవరూ ఇలా ఎదురు తిరగవద్దన్న ఉద్దేశంతో వారిని దారుణంగా చితకబాది నిర్మల్–ఎల్లపెల్లి దారిలో గల పెద్ద మర్రిచెట్టుకు రాంజీసహా వెయ్యిమంది అనుచరులను ఒకేసారి ఉరితీశారు. ఇంతటి దారుణమైన ఘటన దేశచరిత్రలో ఎక్కడా లేదు. కనీసం పాఠ్యాంశంగానూ పెట్టలేదు. 2021లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్మల్‌కు వచ్చి ఈ వీరులకు నివాళులర్పించారు. ఆ తర్వాత కూడా ఎలాంటి మార్పు లేదు.


