నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Mar 26 2026 7:23 AM | Updated on Mar 26 2026 7:23 AM

గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

స్వయంగా ప్రకటించిన సీఎం గడిచిపోయిన రెండునెలల కాలం ఇప్పటికీ ముందడుగు పడని వైనం బడ్జెట్‌లో నిధులివ్వని ప్రభుత్వం అసెంబ్లీలోనూ గళమెత్తని ఎమ్మెల్యేలు

ట్రిపుల్‌ ఐటీ పిలుస్తోంది
బాసర ట్రిపుల్‌ఐటీలో 2026–27 సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదలైంది. విద్యార్థులు సరైన ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నిర్మల్‌: ‘కొమురంభీమ్‌, రాంజీగోండ్‌లు పుట్టిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పోరాటాల పురిటి గడ్డ.. జల్‌ జంగిల్‌ జమీన్‌ పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.. ఉమ్మడి జిల్లా అంటే ప్రత్యేకమైన అభిమానం.. పదేళ్లలో ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగింది.. ఎర్రబస్సు ఎరగని ఆదిలాబాద్‌ జిల్లాకు ఎయిర్‌బస్‌ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం.. ఆదిలాబాద్‌ జిల్లాలో పదివేల ఎకరాల్లో అతిపెద్ద పారిశ్రామికవాడ, నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం..’ అంటూ జనవరి 16న నిర్మల్‌లో జరిగిన ప్రజాపాలన బహిరంగసభలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎప్పటి నుంచో అడుగుతున్న నిర్మల్‌ జిల్లాకు యూనివర్సిటీ కావాలనే ప్రతిపాదనకు ఓకే చెబుతూ బహిరంగసభలో జిల్లాలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇది జరిగి రెండునెలలు దాటినా.. మరో రెండునెలలు గడిస్తే కొత్త విద్యాసంవత్సరం వస్తున్నా.. ఇప్పటికీ నూతన యూనివర్సిటీ ఏర్పాటు ఊసేదీ జిల్లాలో వినిపించడం లేదు. బాసర ట్రిపుల్‌ఐటీలో ఈ దిశగా ఏర్పాట్లూ కనిపించడం లేదు.

బడ్జెట్‌లో కేటాయింపుల్లేవ్‌..

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 20న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కావాల్సిన నిధులపై స్పష్టత ఇవ్వలేదు. జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ కోసం ప్రత్యేకంగా కేటాయింపులేవీ కనిపించలేదు. ఓవైపు బాసర ఆలయ అభివృద్ధి విషయంలో మాస్టర్‌ప్లాన్‌లు తయారుచేసి పక్కన పెడుతున్నట్లే, యూనివర్సిటీని కూడా ప్రకటించి పక్కన పెట్టినట్లే కనిపిస్తోందన్న వాదన పెరుగుతోంది. ఉన్న ట్రిపుల్‌ఐటీకే పూర్తిస్థాయిలో నిధులు కేటాయించడం లేదని, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం లేదని, అలాంటిది కొత్తగా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ఇప్పట్లో అవుతుందా?.. అన్న ప్రశ్నలూ పెరుగుతున్నాయి.

నిర్మల్‌లో ఏర్పాటు చేసేలా..

బాసరలో కాకుండా జిల్లాకేంద్రంలో యూనివర్సిటీ ఉండాలన్న డిమాండ్‌ కూడా ఉంది. బాసరలో ఇప్పటికే ట్రిపుల్‌ఐటీ ఉందని, తాత్కాలికంగా అందులో తరగతులు ప్రారంభించినా పూర్తిస్థాయి యూనివర్సిటీని మాత్రం జిల్లాకేంద్రం సమీపంలో ఏర్పాటు చేయాలంటున్నారు. జిల్లాతో పాటు చుట్టూ ఉన్న జిల్లాలకు నిర్మల్‌ దగ్గరలో ఉండటం, ఇక్కడ కూడా ఉన్నత విద్యాసంస్థలు లేకపోవడం, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండటంతో పాటు ముందు నుంచీ జిల్లాకేంద్రంలోనే జ్ఞానసరస్వతీ పేరిట యూన్సివర్సిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఉంది. మరోవైపు బాసర ఆర్జీయూకేటీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంది. అలాంటి చోట మరో అటానమస్‌ యూనివర్సిటీ పెట్టడం ఇబ్బందికరం. అసలు.. ఇప్పటికే 9వేలకు పైగా విద్యార్థులు ఉండటంతో ట్రిపుల్‌ఐటీకే ఆ స్థలం సరిపోవడం లేదు. వీటన్నింటి నేపథ్యంలో నిర్మల్‌లోనే కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న వాదన పెరుగుతోంది.

బాసర ట్రిపుల్‌ఐటీ

జిల్లాకు ఇస్తామని ప్రకటించిన జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ ఏర్పాటు గురించి అటు పాలకపక్షం, ఇటు ప్రతిపక్షం రెండూ పట్టించుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనూ కొత్త యూనివర్సిటీ ఏర్పాటుపై లేవనెత్తకపోవడంపై విద్యావంతులు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యేతో పాటు ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు. ఈ ముగ్గురూ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై మాట్లాడాలని, త్వరలోనే ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీ సుకురావాలని జిల్లావాసులు కోరుతున్నారు.

అడిగేదెవరు...!?

రెండు నెలలే..

నిర్మల్‌ బహిరంగసభలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించి రెండునెలలు దాటింది. మరోవైపు కొత్త విద్యాసంవత్సరానికి మరో రెండునెలలే సమయముంది. పూర్తిస్థాయిలో యూనివర్సిటీ ఏర్పాటయ్యేదాకా, ట్రిపుల్‌ఐటీలో రెడీగా ఉండే సౌకర్యాలతో తాత్కాలిక విశ్వవిద్యాలయం ప్రారంభించవచ్చన్న ఉద్దేశంతోనే సీఎం బాసరలో ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ఇక్కడ ఇప్పటికీ ఆ దిశగా కూడా ఏర్పాట్లు ఏవీ జరగడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement