పత్తాలేని పారితోషికం | - | Sakshi
Sakshi News home page

పత్తాలేని పారితోషికం

Mar 26 2026 7:23 AM | Updated on Mar 26 2026 7:23 AM

● 16 నెలలుగా ఎన్యూమరేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్ల ఎదురుచూపు ● ఇప్పటికీ ఊసే ఎత్తని ప్రభుత్వం

నిర్మల్‌చైన్‌గేట్‌: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2024 నవంబర్‌లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా సేవలందించిన ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు పారితోషికం కోసం 16 నెలలుగా ఎదురుచూస్తున్నారు. అధికారులను కలుస్తూ తమ సమస్య విన్నవిస్తున్నారు. ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేసి ఏడాది దాటినా నేటికీ వారికి అందాల్సిన గౌరవ వేతనం రాలేదు. దీంతో అసలు వస్తుందా?.. రాదా? అనే సందిగ్ధంలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఇప్పటికీ ఊసెత్తకపోవడంతో కొంత ఆందోళన చెందుతున్నారు.

2024 నవంబర్‌లో సర్వే...

సాధారణ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచడంతో పాటు ఇటు ప్రభుత్వ పరంగా అమలు చేసే సంక్షేమ పథకాలను పేదలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2024 నవంబర్‌ 6 నుంచి 21 వరకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణన చేపట్టింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, మున్సిపల్‌ వార్డు అధికారులు, సెర్ఫ్‌ సిబ్బంది, ఎన్యూమరేటర్లు, సూపర్‌ వైజర్లుగా పనిచేశారు. ఒక్కొక్కరు 120 నుంచి 150 వరకు కుటుంబాల చొప్పున ఎంచుకొని వివరాలు సేకరించారు. ఈ సర్వే అనంతరం నవంబర్‌ 22 నుంచి డిసెంబర్‌ 6 వరకు కుటుంబ వివరాలను డేటా ఎంట్రీ ఆపరేటర్లు రాత్రింబవళ్లు పనిచేసి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.

2,34,864 కుటుంబాల సర్వే...

జిల్లాలో చేపట్టిన సర్వేలో 1,698 మంది ఎన్యూమరేటర్లతో పాటు పర్యవేక్షణ కోసం మరో 168 మంది సూపర్‌వైజర్లు విధులు నిర్వర్తించారు. ఒక్కో ఎన్యూమరేటర్‌ 150 కుటుంబాల చొప్పున సర్వే చేశారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 86 వార్డులు, 400 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 2,34,864 కుటుంబాలకు చెందిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ పరిస్థితులతో పాటు కులం వివరాలను కూడా ఈ సందర్భంగా నమోదు చేశారు. ఒక్కో కుటుంబానికి 8 పేజీలతో కూడిన సర్వే ఫారంలో 75 రకాల ప్రశ్నలుండగా, ఆయా కుటుంబ సభ్యుల నుంచి ఓపిగ్గా వివరాలు రాబట్టారు. కేవలం 20 రోజుల్లో సర్వే పూర్తి చేశారు.

ఆన్‌లైన్‌ చేసిన డబ్బులు చెల్లించాలి

2024 నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన డాటా ఎంట్రీ ప్రక్రియను ఆన్‌లైన్‌లో నమోదు చేశాం. 16 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదు. అధికారులు స్పందించి డాటా ఎంట్రీ డబ్బులు త్వరగా ఇప్పించాలి.

– జి.వెంకటేష్‌, ప్రైవేటు డాటా ఎంట్రీ ఆపరేటర్‌

సమగ్ర కుటుంబ సర్వే వివరాలు

నోడల్‌ అధికారులు : 21

ఎన్యూమరేటర్లు : 1698

సూపర్‌వైజర్లు : 168

డాటా ఎంట్రీ ఆపరేటర్లు : 2164

మాస్టర్‌ ట్రైనర్లు : 05

స్టిక్కరింగ్‌ చేసిన కుటుంబాలు : 2,28,859

ఆన్‌లైన్‌ చేసిన కుటుంబాలు : 2,34,864

జిల్లాలో బకాయిలు రూ.2.06 కోట్లు..

సర్వేలో పాల్గొనే ఎన్యూమరేటర్లకు రూ.10 వేలు, సూపర్‌వైజర్లకు రూ.12 వేలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో దరఖాస్తుకు రూ.7 చొప్పున ఇవ్వాల్సి ఉంది. 2,164 మంది ఆపరేటర్లు పాల్గొన్నారు. వీరందరికీ కలిపి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.2.06 కోట్ల మేర గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement