తలాపునే గోదావరి.. పంట తడికి నీరేది? | - | Sakshi
Sakshi News home page

తలాపునే గోదావరి.. పంట తడికి నీరేది?

Mar 26 2026 7:23 AM | Updated on Mar 26 2026 7:23 AM

కాళేశ్వరం నీళ్ల కోసం రైతుల నిరీక్షణ ప్యాకేజీ 28 పనులు పూర్తయితేనే ఫలితాలు 2008లో ప్రారంభం.. ఇప్పటికీ పూర్తి కాని వైనం..

కుంటాల – ఓలా గ్రామాల మధ్య అర్ధాంతరంగా నిలిచిన కాళేశ్వరం 28 ప్యాకేజీ పనులు

భైంసా: మహారాష్ట్ర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవహించే గోదారమ్మ తలాపునే ఉన్నా.. ముధోల్‌ నియోజకవర్గ రైతుల పంట తడికి సాగు నీరందడం లేదు. నియోజకవర్గ రైతులు సాగునీటి కోసం ఆకాశం వైపు ఎదురుచూసే పరిస్థితి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ముధోల్‌ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కాలువల తవ్వకం పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. నీళ్లొస్తాయని ఆశ పడ్డ రైతుల ఆశలు ఆవిరైపోతున్నాయి. గోదావరినది దాటి అవతలివైపు ఎటుచూసిన పచ్చని పొలాలు కనిపిస్తాయి. కానీ ఇటువైపు ఎండిన భూములు, మట్టికొండలే కనిపిస్తున్నాయి. గోదావరి నీరు పొలాలకు చేరితేనే ఇక్కడి పరిస్థితి మారుతుంది.

2008లో ప్రారంభమైనా..

2008–09లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులకు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆమోదం లభించింది. అప్పట్లో ఈ ప్రాజెక్టు వ్యయం రూ.38,500 కోట్లు అంచనా వేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. ఇందులో భాగంగా ముధోల్‌ నియోజకవర్గానికి కాలువలు తవ్వి ఎత్తిపోతల ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని మళ్లీ ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ చేశారు. ఇందుకు అవసరమయ్యే 3,026 ఎకరాల్లో 555 ఎకరాలే సేకరించారు. ముధోల్‌ నియోజకవర్గంలో ఈ పనులు పూర్తి చేసి 50 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉండగా ఒక్క ఎకరాకు నీరివ్వలేదు.

పూర్తయితే రెండు పంటలు..

కాళేశ్వరం ప్యాకేజీ 28 పనులు పూర్తయితే ముధోల్‌ నియోజకవర్గంలో రెండు పంటలు పండుతాయి. బాసర, ముధోల్‌, తానూరు, భైంసా, కుభీర్‌, కుంటాల మండలాల్లో ఇప్పటికీ వర్షాధారంపైనే రైతులు ఆధారపడ్డారు. నీరందిస్తే రెండు పంటలు పండిస్తారు. ప్రస్తుతం బోరుబావుల కింద పంటలు పండిస్తున్నారు. నీటి సౌకర్యం లేని రైతులంతా ఒకే పంటతో సరిపెడుతున్నారు.

ఏళ్లుగా ఎదురుచూపులు..

2008 నుంచి ఇప్పటి వరకు ముధోల్‌ రైతాంగం ఈ కాళేశ్వరం నీటి కోసం ఎదురుచూస్తునే ఉంది. గోదావరి నది నుంచి రివర్స్‌ పంపింగ్‌ విధానంలో లోకేశ్వరం మండలం బ్రహ్మేశ్వర్‌ వద్ద లిఫ్ట్‌ నిర్మించి కాలువల ద్వారా లోకేశ్వరం, ముధోల్‌, తానూరు, కుభీర్‌ మండలాలకు మరోవైపు గుండంపెల్లి వైపు నుంచి కాలువలు తవ్వి కుంటాల, భైంసా మండలాలకు సాగు నీరు అందించేలా డిజైన్‌ చేశారు. ఈ విషయమై రైతులు పలుమార్లు ప్రజాప్రతినిధులను కలిశారు. అయినా పనులు పూర్తి కావడం లేదు.

అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి..

ప్యాకేజీ 28 పనులకు బడ్జెట్‌లో నిధులు ఇవ్వాలని ఇటీవలే అసెంబ్లీలో వేదికగా ప్రభుత్వాన్ని కోరాను. ముధోల్‌ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే నా లక్ష్యం. 2008 నుంచి ఈ పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కాలువలు తవ్విన మధ్యలోనే పనులు నిలిపివేశారు. ప్యాకేజీ 28కి సంబంధించి అవసరమయ్యే నిధులు విడుదల చేయాలని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించా. ముధోల్‌ నియోజకవర్గం పక్క నుంచే గోదావరి నది ప్రవహిస్తుంది. కానీ ఇక్కడి రైతులకు నీరు అందడం లేదు. గోదావరి నది నీరు కాలువల ద్వారా ముధోల్‌ రైతులకు అందించాలన్నది నా కల. ఈ కాలువల ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరంది రెండు పంటలు పండితే రైతు కుటుంబాల కష్టాలు దూరమవుతాయి.

– పవార్‌ రామారావు పటేల్‌, ముధోల్‌ ఎమ్మెల్యే

కోట్ల రూపాయలు ఖర్చు..

ప్యాకేజీ 28 కింద కాలువలు తవ్వడం, పంపుల సామర్థ్యం, మోటార్లు బిగించడం ఇలా అన్ని పనులకు కలిపి ఇప్పటి వరకు రూ.235.41 కో ట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఈ పనులు ఇంకా రూ.251.26 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. 50 వేల ఎకరాలకు సంబంధించి ఈ ప్యాకేజీ కింద రూ.486.67 కోట్లు నిధులు అవసరమని అంచనా వేశారు. ఈ పనుల్లో 49 శాతమే పూర్తయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement