భైంసాటౌన్: మున్సిపాలిటీలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఆస్తిపన్ను వసూళ్లు జిల్లాలో అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. మూడు మున్సిపాలిటీల్లోనూ 45 శాతం మించి వసూలు కాలేదు. ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరం ఈనెల 31తో ముగియనుంది. పన్నుల వసూలుకు ఇంకా ఐదురోజులే గడువు ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ఆస్తిపన్ను వసూళ్లు వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాలతో పన్ను వసూలు చేస్తున్నారు.
నిధులు లేక నీరసం..
మున్సిపాలిటీకి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంతోనే పాలకవర్గం సూచనల మేరకు అధికారులు వెచ్చిస్తుంటారు. రహదారుల మరమ్మతు, తాగునీటి సరఫరా, మరమ్మతు పనులు, విద్యుత్ దీపాలు, బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు, పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన పరికరాల కొనుగోలు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల చెల్లింపులు, చెత్త సేకరణ వాహనాలకు డీజిల్ ఖర్చులు, మరమ్మతులు వంటి పనులకు ఖర్చు చేస్తారు. అయితే పన్ను వసూళ్లు ఆశించిన స్థాయిలో వసూలు కావడం లేదు. ఫలితంగా ఆయా మున్సిపాలిటీల్లో రోజువారి కార్యకలాపాలకు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడు
తోంది.
పన్నులు సకాలంలో చెల్లించాలి
పన్నుల వసూలు కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. బిల్ కలెక్టర్లకు రోజువారి టార్గెట్ విధించి వసూలు చేస్తున్నాం. పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు, మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర పనుల కోసం నిధులు అవసరం. పట్టణ ప్రజలు సైతం తమ ఇంటి, ఆస్తి, నల్లా బిల్లులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలి.
– వై.నవీన్, మున్సిపల్ కమిషనర్, భైంసా
బల్దియాల్లో పన్ను వసూళ్లు ఇలా..
మున్సిపల్ అసెస్‌మెంట్లు డిమాండ్ వసూలు శాతం
నిర్మల్ 24,872 రూ.112.18 కోట్లు రూ.49.49 కోట్లు 44.12
భైంసా 12,540 రూ.5.60 కోట్లు రూ.1.71 కోట్లు 30.54
ఖానాపూర్ 6,954 రూ.2.55 కోట్లు రూ.1.21 కోట్లు 47.45


