ఖానాపూర్: అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థతో పాటు అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ సహకారంతో శాశ్వత వ్యవసాయ విధానం(పర్మ కల్చర్) ద్వారా ప్రకృతి సాగు, అనుబంధ రంగాల్లో జీవనోపాధి కల్పనపై సత్తన్‌పల్లి గ్రామంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ విజ యానంద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్వాహకులు మాట్లాడారు. ప్రాజెక్టు డైరెక్టర్, శాశ్వత వ్యవసాయ నిపుణుడు కొప్పుల నరసన్న మాట్లాడుతూ.. రాబోయే మూడేళ్లలో చేపట్టబోయే శాశ్వత వ్యవసాయ విధానాలు, భూసంరక్షణ చర్యలు, ఆరోగ్యకరమైన పంటల ఉత్పత్తి, జీవవైవిధ్యం పెంపు, పర్యావరణ సంరక్షణ వంటి అంశాలను వివరించారు. ప్రస్తుతం అమలులో ఉన్న రసాయన ఆధారిత వ్యవసాయంతో భూమిలోని పోషకాలు, సేంద్రియ కార్బన్ తగ్గిపోవడం, నేల జీవరాసుల నష్టం, పంటల వైవిధ్యం తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. అడవులను నరికి సాగు చేయడంతో వన్యప్రాణులకు ఆవాసం లేకుండా పోతోందన్నారు. సమస్యలను అధిగమించేందుకు మూడు సంవత్సరాల ప్రణాళికతో భూసార సంరక్షణ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల అమలు చేస్తామని తెలిపారు. అంతకముందు ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో వందశాతం సబ్సిడీపై మంజూ రైన విత్తన ప్యాకెట్‌లను పలువురు రైతులకు పంపి ణీ చేశారు. సంస్థ సీఈవో పద్మ, స్టేట్ కోఆర్డినేటర్ స్నేహ, జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ సుమన్, సంస్థ ప్రతినిధులు పవన్, సుప్రియ, రమ్య, ఆదిలాబాద్ రైతు ఉత్పత్తిదారుల సంస్థ వైస్‌చైర్మన్ బోసు నారా యణ, నాయకులు నేతుల లక్ష్మణ్ పాల్గొన్నారు.


