నిర్మల్‌చైన్‌గేట్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ రకాల పంటల రుణాల పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రధానంగా వరికి గతంలో రూ.46 వేలు ఉండగా రూ.48 వేలకు పెంచింది. పత్తికి రూ.50 వేలు ఉండగా రూ.52 వేలు ఇవ్వనుంది. గతేడాదితో పోలిస్తే ఒక్కో పంటపై అదనంగా రూ.2వేలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం పెంచిన రుణ పరిమితితో రైతులకు మేలు కలగనుంది. బ్యాంకుల ద్వారా కర్షకులకు అందించే రుణం పెరగనుంది.
గతేడాది ఇవ్వని పంటలకు ఈసారి..
2025–26 ఆర్థిక సంవత్సరంలో రుణాలను ఇవ్వని వివిధ రకాల పంటలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. నీటి పారుదల సౌకర్యం కలిగి ఉండి పత్తి సాగు చేసే రైతులకు గత ఆర్థిక సంవత్సరంలో రుణాలు ఇవ్వలేదు. ఈసారి ఎకరానికి రూ.52 వేల చొప్పున రుణం బ్యాంకులు ఇవ్వనున్నాయి. అలాగే వరి పంట (డైరెక్ట్ సీడ్ రైస్) ఎకరానికి రూ.45 వేలు, చిల్లీస్ (విత్ మల్చింగ్) రూ.లక్ష, పుదీనా రూ.35 వేలు, అంటు కట్టిన కూరగాయలు ఎకరానికి రూ.70 వేలు, మల్బరీకి రూ.64 వేలు, జోవర్ (స్వీట్) రూ.24 వేలు చొప్పున ఈసారి రుణాలను ఇవ్వనున్నాయి.
గొర్రెలు, మేకల యూనిట్లకూ పెంపు..
గొర్రెలు, మేకలు, బాయిలర్ కోళ్ల యూనిట్లపైనా ప్రభుత్వం రుణ పరిమితి పెంచింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో గొర్రెల యూనిట్ కు రూ.26 వేలు నుంచి రూ.28 వేలు రుణంగా ఇవ్వగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో యూనిటు రూ.32 వేలు ఇవ్వనున్నాయి. మేకల యూనిటు రూ.27 వేల నుంచి రూ.29 వేలు ఇవ్వగా, ఇకపై రూ.35 వేలు బ్యాంకులు ఇవ్వనున్నాయి. బాయిలర్, లేయర్ కోళ్ల పైనా కూడా రుణ పరిమితిని పెంచింది.
ఉద్యాన, కూరగాయల సాగుకు అంతంతే..
పండ్ల తోటలకు, కూరగాయలు, ఉద్యాన పంటలకు రుణ పరిమితి పెంపు నామమాత్రమే. గతేడాదితో పోల్చితే ఎకరా రూ.వెయ్యి మాత్రమే పెంచారు. ఆయిల్‌పామ్ పంటకు ప్రభుత్వం నాలుగేళ్ల వరకు సాయం చేస్తుండటంతో అయిదో ఏడాది నుంచి ఎకరాకు రూ.50 వేలు రుణం ఇవ్వాలని నిర్ణయించారు. వర్షాధార టమాటాకు రూ.43 వేలు ఉండగా నీటి పారుదల కింద సాగు చేసే రైతులకు రూ.58 వేలుగా రుణ పరిమితిని నిర్ణయించారు. మల్చింగ్ సాగు చేస్తే రూ.72 వేలు ఇవ్వనున్నారు.
రైతులకు ఎంతో మేలు
ప్రభుత్వం పెంచిన రుణపరిమితిని సద్వినియోగం చేసుకోవాలి. బ్యాంకర్లు కూడా రైతులకు విరివిగా రుణాలను అందిస్తున్నారు. గత డిసెంబర్ వరకు 70 శాతం రుణాలు అందించాం. రైతులు అప్పులు చేయకుండా బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలను సాగు పెట్టుబడిగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
– రామ్‌గోపాల్, లీడ్ బ్యాంకు మేనేజర్
పంటల వారీగా ఖరారు చేసిన రుణ పరిమితి (రూ.ల్లో)
పంట 2025–26 2026–27
పత్తి 48 వేలు 50 వేలు
వరి 46 వేలు 48 వేలు
మిర్చి 86 వేలు 90 వేలు
మొక్కజొన్న 29 వేలు, 32 వేలు
పెసర 22 వేలు 23 వేలు
ఆయిల్ పామ్ 48 వేలు 50 వేలు
నువ్వులు 22 వేలు 23 వేలు
గోధుమలు 21 వేలు 22 వేలు
మేకల యూనిట్ 29 వేలు 35 వేలు
గొర్రెల యూనిట్ 28 వేలు 32 వేలు
2025–26 సంవత్సరంలో
మొత్తం రైతులు 2,24,560
పంపిణీ చేసిన రుణం 4,528.92 కోట్లు


