సుపరిపాలన అందించాలి | - | Sakshi
Sakshi News home page

సుపరిపాలన అందించాలి

Feb 19 2026 10:15 AM | Updated on Feb 19 2026 10:15 AM

సుపరిపాలన అందించాలి

సుపరిపాలన అందించాలి

ఎమ్మెల్యే పి రామారావు పటేల్‌ బాధ్యతలు స్వీకరించిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌

భైంసాటౌన్‌: భైంసాలో రాక్షస పాలనకు ప్రజలు తమ ఓటుతో స్వస్తి పలికారని, సుపరిపాలన కోసం నూతన నాయకత్వానికి అధికారం కట్టబెట్టారని ముధోల్‌ ఎమ్మెల్యే పి.రామారావు పటేల్‌ అన్నారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా పాలన అందించాలని నూతన పాలవర్గానికి సూచించారు. మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ దత్తాత్రి, వైస్‌ చైర్‌పర్సన్‌ బీబీ కుతిజా సిద్ధిఖా బుధవారం బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పూజా, ప్రార్థన నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. భైంసాలో ఈరోజు దీపావళి, రంజాన్‌ పండుగలా అనిపిస్తోందన్నారు. నూతన పాలకవర్గానికి తన పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయన్నారు. అందరి సూచనలు, సలహాలతో పాలన సాగించాలన్నారు. పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

అవినీతి రహిత పాలన అందిస్తాం..

కుల, మతాలకతీతంగా అధికారం కట్టబెట్టిన పట్టణ ప్రజలకు శాంతియుత, అవినీతి రహిత, అభివృద్ధి సహిత పాలన అందిస్తామని నూతన చైర్మన్‌ తూమోల్ల దత్తాత్రి అన్నారు. వార్డుల్లో కనీస సౌకర్యాలైన మంచి నీరు, సీసీ డ్రెయిన్లు, సీసీ, మొరం రోడ్లు, ఇతర అన్ని వసతులు కల్పిస్తామని అన్నారు. ఇంటి అనుమతుల విషయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. మున్సిపల్‌ ఉద్యోగులు, సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు స్వతంత్ర కౌన్సిలర్ల మద్దతుదారు, వైస్‌ చైర్‌పర్సన్‌ బీబీ కుతిజా సిద్ధిఖా భర్త ఇద్రిస్‌ బేగ్‌ మాట్లాడుతూ.. భైంసాలో ఎంఐఎం అరాచక, అవినీతి, నియంతృత్వ పాలనను అడ్డుకునేందుకు బీజేపీకి మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్‌ బి.గంగాధర్‌, బీజేపీ నాయకులు రవిపాండే, నారాయణరెడ్డి, రాజేశ్‌బాబు, బబ్రూ మహారాజ్‌, డాక్టర్‌ దామోదర్‌రెడ్డి, బీజేపీ, స్వతంత్ర కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement