కౌన్‌బనేగా ‘భైంసా బాద్‌షా’..!
హంగ్‌తో కంగారులో ఉన్న భైంసా బల్దియా పీఠం ఎవరికి దక్కనుందో ఇంకా తేలడం లేదు. ఫలితాలు వెలువడి మూడురోజులైనా ఒకతాటిపైకి రావడం లేదు. ఇక్కడ పార్టీలకంటే స్వతంత్రులే కీలకంగా మారారు. బీజేపీ రెబల్స్‌గా నిలి చి గెలిచిన వారిలో ఒకరు చైర్మన్‌గా, ఎంఐఎం వ్యతిరేకవర్గంలో ఒకరు వైస్ చైర్మన్‌గా అధికారం కై వసం చేసుకుంటారన్న ప్రచారం మొదట్లో సాగింది. తాజాగా ఆదివారం ఎంఐఎం వ్యతిరేకవర్గ నేత ఇద్రిస్ ప్రెస్‌మీట్ పెట్టి, ఇరు ప్రధాన పార్టీలు వైస్ చైర్మన్ పదవి ఇస్తామని తమ మద్దతు కోరాయన్నారు. అయితే, తమ అభ్యర్థికి మొదటి రెండేళ్లు చైర్మన్ పదవి ఇచ్చినవారికే తన మద్దతిస్తానంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో అటు బీజేపీ మద్దతుదారులు, ఇటు ఎంఐఎం మళ్లీ సమాలోచనల్లో పడ్డాయి. ఎంఐఎంకు మ్యాజిక్ ఫిగర్ 14కు కావల్సిన రెండే సీట్లు ఇబ్బంది పెడుతున్నాయి. బీజేపీ ఆరు గెలిచినా, ఐదుగురు స్వతంత్రులు, ఎక్స్‌అఫీషియోగా ఎమ్మెల్యే రామారావు పటేల్ ఓటేసినా 12 దగ్గరే ఆగాల్సి వస్తోంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఒక్క కౌన్సిలర్‌కు ఆ పార్టీ విప్ జారీ చేసినట్లు సమాచారం. దీంతో భైంసా బాద్‌షాగా ఎవరిని ప్రకటిస్తారో చివరి నిమిషం దాకా సస్పెన్స్ నెలకొంది.


