భూఆక్రమణదారులపై చర్య తీసుకోవాలి
సారంగపూర్: మండలంలోని జామ్ గ్రామం కరిసెల గుట్ట సమీపంలోని ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించుకుని సాగు చేస్తున్నారని సదరు వ్యక్తులపై అధికారులు చర్య తీసుకోవాలని గురువారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. నిర్మల్– స్వర్ణ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలి పారు. గ్రామానికి చెందిన 418, 419, 420, 408, 426, 427 సర్వే నంబర్లను ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలం, గుట్టకు వెళ్లే దారిని ఆక్రమించుకుని సాగుచేస్తున్నారని తెలిపారు. ఆ భూములపై సర్వే చేయించడానికి గ్రామస్తులంతా కలిసి సర్వేయర్‌ను రప్పించే ఏర్పాట్లు చేయగా కొలతలు చేయవద్దని కోర్టు నుంచి స్టేఆర్డర్ తెచ్చినట్లు తెలిపారు. దీంతో కొలతలు చేసేందుకు వచ్చిన సర్వేయర్ వెనుదిరగడంతో గ్రామస్తులు ఆగ్రహించి రోడ్డుపై బైఠాయించి నిరస న వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు కబ్జాదారులకు సహకరిస్తున్నారని ఆరోపించారు. వెంట నే అధికారులు స్పందించి సదరు ప్రభుత్వ భూమి కొలతలు నిర్వహించి వాటిని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించాలని డిమాండ్ చేశారు. గ్రామానికి చేరుకున్న ఎస్సై శ్రీకాంత్ ఆందోళనకారులకు నచ్చజెప్పి శాంతింపజేశారు. విషయం ఉన్నతాధికారుల కు వివరించాలని, వారు స్పందించకపోతే చట్టప్రకా రం వెళ్లాలని తెలిపారు. దీంతో గ్రామస్తులు వెనుదిరిగారు.


