పంచాయతీలకు స్పెషల్ ఫండ్
నిర్మల్‌చైన్‌గేట్: నిధులు లేక నీరసించిన పంచాయతీలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీపి కబురు అందించారు. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ నేరుగా సర్పంచులకు అందిస్తామని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్స్‌తో సంబంధం లేకుండా చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ఇస్తామన్నారు. సీఎం ప్రకటనతో కొత్తగా కొలువుదీరిన సర్పంచులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పాలకవర్గాలు లేక..
పంచాయతీలకు రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. పల్లెల్లో అభివృద్ధి కుంటుపడింది. చాలా గ్రామాలకు సరైన ఆదాయ వనరులు లేకపోవడంతో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పంచాయతీల్లో నిధులు లేవు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఇచ్చిన విధంగానే పంచాయతీలకు సైతం సీఎం ఫండ్ నుంచి ప్రత్యేక అభివృద్ధి నిధులు ఇవ్వనున్నట్లు కొడంగల్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ నిధులు మంజూరైతే పంచాయతీల్లో అభివృద్ధి పనులకు అడుగుపడే అవకాశం ఉంది.
ఎదురుచూస్తున్న సర్పంచులు..
జిల్లాలో పెద్ద పంచాయతీలు తప్ప మిగిలిన పంచాయతీల ఖజానాలో డబ్బులు లేవు. బాధ్యతలు చేపట్టే సమయంలో చాలా గ్రామాల్లో నిధులు లేకపోవడంతో సర్పంచులు పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడం, ఫర్నిచర్ కొనుగోలుకు కూడా సొంత డబ్బులు వెచ్చించారు. తాగునీటి పైప్‌లైన్ మరమ్మతులు, మోటార్ల నిర్వహణ, ట్రాక్టర్ల మరమ్మతుల కోసం నిధులు లేవు. ప్రత్యేక నిధులు వస్తే కొన్ని పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. ఈ నిధుల కోసం కొత్త సర్పంచులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ప్రణాళికలు.. తీర్మానాలు
ప్రత్యేక అభివృద్ధి నిధులతో పల్లెల్లో చేపట్టే పనులపై ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. ఇందు కోసం మూడు నెలల సమయం ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో అభివృద్ధి పనులపై సర్పంచులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కొత్త పాలకవర్గాలతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించి తీర్మానాలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీలు..
జనాభా గ్రామ పంచాయతీలు
500 లోపు 63
501–999లోపు 136
1000–1999లోపు 128
2000–2999 లోపు 46
3 వేలకుపైగా 27


