
● ఎస్పీ జానకీషర్మిల ● పోలీస్ అమరులకు ఘన నివాళి
నిర్మల్‌టౌన్: అందరూ నిద్రపోయినా.. పోలీసులు మాత్రం 24 గంటలు ఆన్ డ్యూటీలో ఉంటారని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. మంగళవారం పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా.. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో అమరవీరుల స్మారక స్తూపం వద్ద కాగడా వెలిగించి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అమరుల ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. దేశ సరిహద్దు భద్రతలో సైనికుడు ఎంత కీలకమో, అంతర్గత భద్రతలో పోలీసులు అంతే కీలకమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు, దేశ అంతర్గత భద్రత, ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతీ సందర్భంలోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుందని వివరించారు. శాంతిభద్రతలు సక్రమంగా ఉంటే మారుమూల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేమని, ప్రతి ఒక్కరూ ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే అని వివరించారు. అనంతరం పోలీస్ అమరుల కుటుంబాలతో మాట్లాడారు. వారి పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారిని ఓదార్చారు. జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఉపేంద్రారెడ్డి, అవినాష్‌కుమార్, రాజేశ్‌మీనా, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్సైలు, ఆర్‌ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.