
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ తదితర అంశాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. సన్న, దొడ్డు రకాల ధాన్యం కోసం వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల్లో తూకపు యంత్రాలు, తేమ యంత్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ముందుగా పరిశీలించాలని తెలిపారు. ప్రతీ వేయింగ్ మిషన్‌కి తప్పనిసరిగా స్టాంపింగ్ చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలు గ్రామాలకు సమీపంలో ఏర్పాటు చేసి రైతులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. టార్పాలిన్‌లు, గన్నీ సంచులు సరిపడా అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. లారీలు, కూలీల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ చేయడంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని తెలి పారు. అవసరమైతే కంట్రోల్ రూమ్ నంబర్ 9182958858ను సంప్రదించాలని సూచించారు. కొనుగోలు ఏజెన్సీ ల సిబ్బందికి తగిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. హార్వెస్టర్ల యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మార్గదర్శకాలు ఇవ్వాలని సూచించారు. రోజువారీగా వరి ధాన్యం కొనుగోలు వివరాలు తనకు అందజేయాలని అధికారులను సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, పౌర సరఫరాల అధికారి రాజేందర్, జిల్లా మేనేజర్ సుధాకర్, డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్ పాల్గొన్నారు.