యాచకుల లెక్కింపు! | - | Sakshi
Sakshi News home page

యాచకుల లెక్కింపు!

Oct 22 2025 6:51 AM | Updated on Oct 22 2025 6:51 AM

యాచకుల లెక్కింపు!

యాచకుల లెక్కింపు!

నిర్మల్‌చైన్‌గేట్‌:దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో యాచకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టింది. ప్రార్థనా మందిరాలు, బస్టాండ్లు, రద్దీ వీధుల్లో నివసించే వారి జీవన స్థితి, ఆహార పద్ధతి, ఆరోగ్య పరిస్థితి, యాచనకు దారితీసిన కారణాలు వంటి అంశాలపై వివరాలు సేకరించారు. జిల్లాలోని నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీల పరిధిలో మెప్మా అధికారుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు.

పేదరిక నిర్మూలనే లక్ష్యం

పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం కేంద్రం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

సర్కారు పథకాలు అందుబాటులో ఉన్నప్పటికీ, యాచకులు గుర్తింపు ఆధారాలు లేకపోవడం వల్ల వాటి ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు స్థలాలు మార్చుకుంటూ జీవనం సాగించడం వల్ల ప్రభుత్వ పథకాలు చేరడం కష్టంగా మారింది. ఈ పరిస్థితిని మార్చేందుకు సరైన డేటా సేకరణ ద్వారా పునరావాస విధానం రూపుదిద్దుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం లెక్కింపు చేపట్టింది.

’మిషన్‌ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ పావర్టీ’ సర్వే

మున్సిపాలిటీ ఏరియాల్లో మిషన్‌ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ పావర్టీ పేరుతో సర్వే దేశవ్యాప్తంగా మున్సిపాలిటీల పరిధిలో చేపట్టింది. జిల్లాలో ఈ నెల 15 వరకు సర్వే చేశారు. మెప్మా ప్రాజెక్ట్‌ అధికారులు, రిసోర్స్‌ పర్సన్లు పట్టణాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేలో భాగంగా ప్రతీ వ్యక్తి గురించి వ్యక్తిగత, కుటుంబ, సామాజిక వివరాలు నమోదు చేశారు. లింగం, వయసు, కుటుంబ స్థితి, వివాహ స్థితిగతులు, మతం, కులం, మాతృభాష వంటి వివరాలతో పాటు యాచనకు గల కారణాలపై ఆరా తీశారు. వైకల్యం, వృద్ధాప్యం, వ్యసనాలు, నిరుద్యోగం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా వెలుగులోకి వస్తున్నాయి. కేంద్రం రూ పొందించిన కొత్త నమూనాలో ఆరు విభాగాలుగా ప్రశ్నలు రూపొందించింది. వ్యక్తిగత సమాచారం, కుటుంబ మానవ వనరుల వివరాలు, భిక్షాటన స్వచ్ఛందమా, లేక బలవంతమా, రోజువారీ ఆదాయం, ఖర్చు పద్ధతులు, ప్రభుత్వం చేయూతనిస్తే యాచన మానుతారా, నైపుణ్య శిక్షణపై ఆసక్తి ఉందా, ఆహారం, ఆరోగ్యస్థితి, వైద్య సహాయం అవసరమా, భవిష్యత్‌ ఆశలు, ప్రభుత్వ సహకారంపై అభిప్రాయాలు, వివరాలు సేకరించారు.

పునరావాసం కల్పించేలా..

ఈ సర్వే ద్వారా యాచకుల పూర్తి వివరాలు నమోదు చేసి, వారికి తగిన పునరావాస ప్యాకేజీలు, ఉపాధి అవకాశాలు కల్పించడమే కేంద్ర ఉద్దేశం. సమగ్ర గణాంకాల ఆధారంగా సర్కారు కొత్త పథకాలు రూపొందించేందుకు మార్గం సుగమం కానుంది. ఈ సర్వేతో ప్రభుత్వం పేదరిక నిర్మూలన కొత్త దిశగా అడుగుపెడుతోంది.

జిల్లాలో గుర్తించిన యాచకులు..

మున్సిపాలిటీ యాచకుల సంఖ్య

నిర్మల్‌ 32

భైంసా 03

ఖానాపూర్‌ 03

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement