
నేడు రైతుల పాదయాత్ర
భైంసా: రైతులు పండించిన పంటల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ ఆధ్వర్యంలో మంగళవారం పాదయాత్ర చేపట్టనున్నారు. లక్ష్మణచాందలో భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో రైతులంతా సమావేశం ఏర్పాటు చేశారు. పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడం లేదన్నారు. అధిక వర్షాలతో సోయా, పత్తి, వరి పంటలు నీట మునిగాయని, బాధితులకు ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదన్నారు. చేతికి వచ్చిన సోయా, పత్తి, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేసింది. ఈమేరకు బాసరలో సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఉదయం పూజలు చేసి పాదయాత్ర ప్రారంభించనున్నారు. బాసర నుంచి భైంసా వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. పార్టీలకతీతంగా ఈ సమావేశాలకు హాజరు కావాలని అంతా కోరుతున్నారు.