
పరిశీలించి.. పరిష్కరించండి
నిర్మల్‌చైన్‌గేట్: తమ అర్జీని పరిశీలించి.. సమస్య పరిష్కరించాలని పలువురు బాధితులు ప్రజావాణిలో కలెక్టర్‌ను వేడుకున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అభిలాష అభినవ్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలాలవారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. అనంతరం అధికారులతో సమీక్ష చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వేగంగా పూర్తి చేయించాలన్నారు. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫేషియల్ రికగ్నేషన్ హాజరు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీరోజు విద్యాసంస్థల్లో వంద శాతం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు ఉండేలా చూడాలని పేర్కొన్నారు. ప్రత్యేక అధికారులు ప్రభుత్వ విద్యాసంస్థలను నిరంతరం తనిఖీ చేస్తూ ఉండాలన్నారు. ఈ నెల 15 నుంచి నవంబర్ 14 వరకు పశువులకు టీకాలు వేయనున్నట్లు వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న వరద నష్ట నివారణ బకా యిలు చెల్లించేలా తహసీల్దార్లు చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖలఅధికారులు పాల్గొన్నారు.
పట్టా పాస్‌బుక్ ఇప్పించండి..
2018లో అనారోగ్యం కారణంగా మా అమ్మ అల్లెపు యాదమ్మా(50)మరణించింది. మా కుటుంబ సభ్యుల ఒప్పందంతో తర్లపాడు శివారులోని సర్వే నం137/3 లో ఉన్న ఎకరం భూమిని పట్టా చేసుకున్నాను. కానీ ఇప్పటి వరకు నాకు పాసుబుక్ రాలేదు. పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లే ఆర్డీవో వద్ద డీఎస్ పెండింగ్ అని తెలుపుతున్నారు. నాకు పాసుబుక్ ఇప్పించండి.
– అల్లెపు నర్సయ్య, పాత తర్లపాడు