
వ్యాపారుల సిండికేట్
మద్యం టెండర్ల కోసం ఒక్కటవుతున్నారు. కలిసికట్టుగా దరఖాస్తులు.. షాపు ఎవరికి వచ్చినా పొత్తు ముందుగానే ఒప్పందం గ్రూపులుగా ఏర్పడి దరఖాస్తులు
‘జిల్లాకు చెందిన ఓ మద్యం వ్యాపారి గత సీజన్ మద్యం షాపుల కోసం ఆయనతోపాటు కుటుంబ సభ్యుల పేర్లతో రూ.16 లక్షలతో ఎనిమిది డీడీలు తీశాడు. జిల్లాలోని కొన్ని దుకాణాలకు దరఖాస్తులు చేశాడు. దురదష్టవశాత్తు ఒక్క షాపు కూడా లాటరీలో తగలలేదు. ఇప్పుడు అదే వ్యాపారి మరో నలుగురు మిత్రులతో సిండికేటుగా ఏర్పడి పలు షాపులకు దరఖాస్తు చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇందులో ఒకటి, రెండు వచ్చినా.. లాభం మాట ఏమో కానీ నష్టం మాత్రం రాదనే నమ్మకంతో ఉన్నాడు’ ఇలా జిల్లాలో మద్యం వ్యాపారులు ఎలాగైనా షాపులు దక్కించుకోవడమో.. లేదా షాపుల్లో భాగస్వామ్యంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ‘పోతే రూ. 3 లక్షలు, వస్తే రూ.కోటి’ అన్నట్లు ఒంటరిగా దరఖాస్తులు చేస్తున్నారు.
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో మద్యం షాపుల కేటాయింపులు మళ్లీ ప్రారంభం కానుండటంతో వ్యాపారులు ఉత్సాహంగా సన్నాహాలు చేస్తున్నారు. గత సీజన్‌లో అపజయం పొందిన వారు ఈసారి కొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నారు. ఎకై ్సజ్ శాఖ మార్గదర్శకాల ప్రకారం లాటరీ ద్వారా షాపులు కేటాయించబడతాయి. ప్రతీ దరఖాస్తుతో రూ.3 లక్షల డీడీ సమర్పించాలి. లాటరీలో షాపు రాకపోయినా డీడీ తిరిగి రాదు. దీంతో వ్యాపారులు సిండికేట్ అవుతున్నారు. ఆర్థిక నష్టం ముప్పును పంచుకుంటున్నారు. ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వాటాగా చెల్లిస్తున్నారు. ఎవరికి షాపు దక్కినా బాండ్ పేపర్ ఒప్పందం ప్రకారం ప్రతి ఒక్కరికీ వాటా లభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
13 తర్వాత దరఖాస్తుల జోరు..
ఎకై ్సజ్ అధికారులు ఈ నెల 13 తర్వాత దరఖాస్తుల సమర్పణ వేగం మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ప్రతీ టెండర్ కాలంలో దరఖాస్తు ఫీజును పెంచుతూ వస్తోంది. 2019–21లో రూ.లక్షగా ఉన్న ఫీజు 2021–23లో రూ.2 లక్షలకు పెరిగింది. తాజాగా 2025–27 టెండర్లకు రూ.3 లక్షలుగా నిర్ణయించింది. అయినా వ్యాపారులలో ఉత్సాహం తగ్గలేదు. లాటరీ గెలవకపోయినా నాన్ రీఫండ్ అయినా ఫర్వాలేదు అనే ధైర్యంతో ముందుకు వస్తున్నారు.
ఖజానాకు కోట్ల రూపాయలు..
రియల్ ఎస్టేట్, టెక్స్‌టైల్స్, రాజకీయ రంగాలకు చెందిన పెట్టుబడిదారులు కూడా ఈ పోటీలో దిగుతున్నారు. గతంలో 47 షాపుల కోసం 1,067 దరఖాస్తులు వచ్చి ప్రభుత్వానికి రూ.21.34 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తుల సంఖ్య రెట్టింపు అవుతుందని, ప్రభుత్వానికి రూ.40 కోట్ల ఆదాయం వస్తుందని ఎకై ్సజ్ శాఖ చెబుతోంది.
జిల్లాలో మద్యం షాపులు,
బార్ల వివరాలు..
అర్బన్ ఏరియాలో వైన్సులు బార్‌లు
నిర్మల్ 11 4
ఖానాపూర్ 3 1
భైంసా 5 3
18 మండలాల పరిధిలో వైన్సులు 28