
ఆర్డర్ లేక..‘చిక్కి’ పోయింది!
కడెం: గిరిజనుల ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. స్వయం ఉపాధి కోసం ప్రత్యేక రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. గిరిజన ఉత్పత్తుల కొనుగోలు బాధ్యతను కూడా తీసుకుంటున్నాయి. అయితే కడెం మండలం పెద్దూర్ కొలాంగూడలో గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పల్లీపట్టి తయారీ యూనిట్ ఏర్పాటు చేసినా.. రెండు నెలల్లోనే మూతపడింది. గిరిజన మహిళలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఆదిలోనే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఆర్డర్‌లు లేకపోవడం, రుణ భారం పెరగడంతో గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు.
ఐటీడీఏ ప్రోత్సాహంతో..
గిరిజన అభివృద్ధికి ఐటీడీఏ అప్పటి ప్రాజెక్ట్ ఆఫీసర్ వరుణ్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆయన సూచనల మేరకు జై హనుమాన్ కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్ పేరుతో కొలాంగూడకు చెందిన ఆరుగురు కొలం మహిళలు సంఘం ఏర్పాటు చేశారు.
ఆర్డర్‌లేక రెండు నెలలకే..
జూలై నెలలో ఐదు క్వింటాళ్ల పల్లీపట్టి తయారు చేసి జీసీసీ జన్నారం శాఖకు సరఫరా చేశారు. అయితే ఆ తర్వాత కొత్త ఆర్డర్లు రాకపోవడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. పంపిన స్టాక్‌కు చెల్లింపులు కూడా అందలేదు. దీంతో ఆగస్టు నుంచి యూనిట్ పూర్తిగా మూతపడింది.
రుణభారం, సరుకు నష్టం..
రెండు నెలలుగా ఆర్డర్‌లు రాకపోవడంతో సభ్యులు బ్యాంక్‌కు వాయిదాలు చెల్లించలేకపోతున్నారు. ఈ క్రమంలో తయారీకి తెచ్చిన 5 క్వింటాళ్ల పల్లీలు, 3 క్వింటాళ్ల బెల్లం, 30 లీటర్ల గ్లూకోజ్ లిక్విడ్ పాడైపోయాయి. దీంతో ఆర్థికంగా మరింత దెబ్బతిన్నామని యూనిట్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐటీడీఏ జోక్యం కావాలి..
ప్రాజెక్టు ప్రారంభదశలోనే ఇలాంటి ఆటంకాలు రావడం అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. గిరిజన మహిళలు తిరిగి ఉపాధి పొందేలా, దీర్ఘకాలిక ఆర్డర్‌లు ఇవ్వాలని ఐటీడీఏ తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఆర్డర్ లేక..‘చిక్కి’ పోయింది!