లక్ష్మణచాంద: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ నిరుపేదలకు స్థిరమైన ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోది. ఈ పథకం ద్వారా జాబ్ కార్డు కలిగిన కూలీలకు ఏడాదిలో 100 రోజుల పని దినాలను అందించడంతోపాటు, వారికి ఆర్థిక స్థిరత్వం కల్పిస్తోంది. ఇప్పుడు, ఈ కూలీలకు మరింత రక్షణ అందించేందుకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై)ను ఈ పథకంతో అనుసంధానం చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రూ.20తో బీమా సౌకర్యం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద, జాబ్‌కార్డు హోల్డర్లు కేవలం రూ.20 చెల్లించి బీమా పరిరక్షణ పొందవచ్చు. 18 నుంచి 70 ఏళ్లలోపువారు బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతా ఉన్నవారు, సంబంధిత కార్యాలయంలో దరఖాస్తు సమర్పించి, నామమాత్రపు రుసుముతో ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు.
బీమా ప్రయోజనాలు..
ఈ బీమా యోజనలో చేరిన ఉపాధి కూలీలు పని సమయంలో ఊహించని దుర్ఘటనల నుంచి రక్షణ పొందుతారు. పనిలో ఉండగా మరణం సంభవించినా లేదా శాశ్వత వైకల్యం ఏర్పడినా, రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. అదే విధంగా, పాక్షిక వైకల్యం జరిగిన సందర్భంలో రూ.లక్ష బీమా మొత్తం అందించబడుతుంది. ఈ ఆర్థిక సహాయం కూలీల కుటుంబాలకు క్లిష్ట సమయంలో ఆసరాగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.
జిల్లాలో ఇలా...
జిల్లాలో 18 మండలాల్లో 400 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఇక్కడ ఉపాధి హామీ కింద 1,76,575 కుటుంబాల నుంచి 3,34,726 మంది కూలీలు నమోదితులయ్యారు. వీరిలో 85,180 యాక్టివ్ జాబ్ కార్డులతో 1,35,209 మంది కూలీలుగా గుర్తించబడ్డారు. ఈ భారీ సంఖ్యలో కూలీలకు బీమా పథకం గురించి తగిన అవగాహన కల్పించేందుకు అధికారులు గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతీ జాబ్ కార్డు హోల్డర్ ఈ బీమా సౌకర్యాన్ని పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
మండలాల వారీగా కుటుంబాలు, కూలీల వివరాలు..
మండలం కుటుంబాలు కూలీలు
బాసర 1,832 2,818
భైంసా 5,558 8,791
దస్తురాబాద్ 2,906 4,056
దిలావార్‌పూర్ 2814 3868
కడెం 8,555 13,471
ఖానాపూర్ 7,695 11,663
కుభీర్ 7,779 14,742
కుంటాల 3,804 6357
లక్ష్మణచాంద 3,350 4791
లోకేశ్వరం 3,983 6,147
ముధోల్ 3,364 5,447
నర్సాపూర్(జి) 3,734 6,105
నిర్మల్ రూరల్ 3,917 5,368
పెంబి 3,681 5,905
సారంగాపూర్ 7,654 11,187
సోన్ 2,507 3185
తానూర్ 6,753 13,080
మొత్తం జాబు కార్డులు 85180
మొత్తం కూలీల సంఖ్య 1,35,209