
కోడ్ పకడ్బందీగా అమలు చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల నిర్వహణ అంశాలపై అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రతీ అధికారి కోడ్ తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో రాజకీయ ఫ్లెక్సీలు, వాల్ పెయింటింగ్స్ ఉండకూడదన్నారు. రాజకీయ పా ర్టీల కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయం వివరాలను పర్యవేక్షించాలన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఇప్పటికే చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, అధికారులు ఎప్పటికప్పుడు చెక్ పోస్టులను తనిఖీ చేస్తూ ఉండాలన్నారు. ఎన్నికల ప్రక్రి య సజావుగా జరిగేందుకు ఎఫ్‌ఎస్టీ, వీఎస్టీ, ఎస్ ఎస్టీ బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. రూట్ అధికారులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి, ఆయా మార్గాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయేమో చూడాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి విస్తృత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్ట ర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, సీపీవో జీవరత్నం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.