
భీమన్న ఆలయం ఆక్రమణపై ఎస్పీకి ఫిర్యాదు
నిర్మల్‌టౌన్: మామడ మండలం పోతారం గ్రామంలో ఆదివాసీ నాయక్‌పోడ్‌ల ఆరాధ్య దైవం భీమన్న ఆలయాన్ని గిరిజనేతరులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య తెలిపారు. ఈ విషయంపై ఎస్పీ జానకీ షర్మిలకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసుల కులదైవం భీమన్న ఆలయాన్ని ఆక్రమించడం తమ సంస్కృతి ,సంప్రదాయాలను ధ్వంసం చేయడమే అవుతుందని మండిపడ్డారు. ఈ దౌర్జన్యంపై అధికా రులు తక్షణమే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు సాకి లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంచు శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్ తదితరులు పాల్గొన్నారు.