మీసేవ షాపింగ్ కాంప్లెక్స్ ప్రైవేట్‌కు అప్పగించే యత్నం భైంసా మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ ఆరోపణ సబ్ కలెక్టర్ తీరుపైనా ఆగ్రహం
భైంసాటౌన్: అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఎంఐఎం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, భైంసా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సంచలన ఆరోపణ చేశారు. పట్టణంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పట్టణంలోని తన నివాసంలో శనివారం మాట్లాడారు. పట్టణంలోని మీసేవ షాపింగ్ కాంప్లెక్స్ గ్రేవ్‌యార్డు స్థలంలో ఉందని, ఆ స్థలం కోసం ఓ ప్రైవేట్ వ్యక్తి యత్నిస్తున్నాడని, దీనికి అదనపు కలెక్టర్, భైంసా మున్సిపల్ ప్రత్యేకాధికారి ఫైజాన్ అహ్మద్ సహకరిస్తున్నారని ఆరోపించారు. ఆ స్థలం ప్రైవేట్ వ్యక్తికి అప్పగించాలని మున్సిపల్ కమిషనర్‌పై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన ఉన్నతాధికారి ప్రైవేట్ వ్యక్తికి లబ్ధి చేకూర్చేలా అధికార దుర్వినియోగానికి పాల్పడడం సరికాదన్నారు. పట్టణంలోని నిర్మల్ చౌరస్తాలో శివాజీ విగ్రహం కోసం తవ్విన గుంతను పూడ్చివేయించాలంటూ మున్సిపల్ కమిషనర్‌పై ఒత్తిడి తెస్తున్నారని, స్థానిక సున్నిత పరిస్థితుల దృష్ట్యా ఇది అశాంతికి కారణమవుతుందని చెప్పినా, వినిపించుకోవడం లేదని ఆరోపించారు. భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఎవరైనా అతిథులు వస్తే వారికి విడిది లేకుండా చేశారని ఆరోపించారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే మార్గం మూసివేయించారని, కార్యాలయానికి వచ్చే ప్రజలు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు.