కట్టలు తెగుతున్నయ్‌! | - | Sakshi
Sakshi News home page

కట్టలు తెగుతున్నయ్‌!

Sep 19 2025 2:45 AM | Updated on Sep 19 2025 2:45 AM

కట్టల

కట్టలు తెగుతున్నయ్‌!

ప్రమాదకరంగా చెరువు కట్టలు

‘కొత్త తూముల’ దగ్గరే కోతలు

నీట మునిగిన పంటలు

కొట్టుకుపోయిన చేపలు

దేవునిచెరువుకు భారీ దెబ్బ..

నర్సాపూర్‌(జి) మండలకేంద్రం నుంచి రెండుకిలోమీటర్ల దూరంలో అటవీప్రాంతంలో ఉన్న దేవునిచెరువు కట్టకు భారీ గండిపడింది. ఆగస్టు 29న కురిసిన భారీవర్షానికి అటవీప్రాంతం నుంచి భారీగా వచ్చిన వరదతో కట్ట కొట్టుకుపోయింది. దీంతో చెరువులో నీరంతా వృథాగా పోయింది. అందులోని చేపలు, వాటికోసం మత్స్యకారులు వేసిన వలలు సైతం కొట్టుకుపోయాయి. ఈ చెరువు నిండితే అలుగు ద్వారా మండలకేంద్రంలోని నడించెరువు, బసంతచెరువు, ఊరచెరువుల్లోకి నీళ్లు వచ్చేవి.

కడ్తాల్‌ పెద్దచెరువుకు కోత..

సోన్‌ మండలం కడ్తాల్‌లో దాదాపు 300 ఎకరాల ఆయకట్టుకు పెద్దదిక్కుగా ఉన్న పెద్దచెరువుకు భారీ గండిపడింది. ఈనెల 15న రాత్రంతా కురిసిన భారీ వర్షానికి 16 వేకువజామున తూమువద్ద కోతకు గురైంది. చాలా నీరు వృథాగా పోవడమే కాకుండా దాదాపు 20 ఎకరాల వరకు పంటలను నీటముంచింది. పొలాల్లో ఇసుక మేటలు వేసిందని సంబంధిత రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నీళ్లతోపాటు చేపలు సైతం కొట్టుకుపోయినట్లు మత్స్యకారులు వాపోతున్నారు.

నిర్మల్‌: ఏడాదికేడాది జిల్లాలో వర్షపాతంతోపాటు వరదలు పెరుగుతున్నాయి. అవి మిగిల్చే నష్టాలూ అదేస్థాయిలో పెరుగుతున్నాయి. ఈ ఏడాది సీజన్‌ ప్రశాంతంగా ప్రారంభమైనా ఆగస్టుకు వచ్చేసరికి బీభత్సం సృష్టించింది. ఇప్పటికీ ఎప్పుడు వచ్చిపడుతుందో తెలియదన్నట్లుగా భారీవానలు భయపెడుతున్నాయి. వరదలకు చెరువులు, కాలువకు గండ్లు పడుతున్నాయి. ఇటీవల కొత్తగా నిర్మించిన తూముల వద్దనే ఎక్కువగా కోతలకు గురవుతుండటం గమనార్హం. జిల్లా అధికారులు ఎంత ముందుచూపుతో చూసినా.. జరగాల్సిన నష్టం మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే పలు చెరువులు కోతకుగురవగా, మరికొన్ని ఆందోళనకరంగానే ఉన్నాయి.

ఇప్పటికే నాలుగుచోట్ల..

జిల్లాలో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ప్రధానంగా నాలుగుచోట్ల నీటివనరులకు గండ్లు పడ్డాయి. నర్సాపూర్‌(జి)లో దేవుని చెరువు, సోన్‌ మండలంలో కడ్తాల్‌ పెద్దచెరువులతోపాటు సారంగపూర్‌ మండలం బోరిగాం సమీపంలోని చీకటిరేవు వద్ద స్వర్ణ ప్రాజెక్టు కాలువ దెబ్బతింది. కాలువలోని నీరంతా రావడంతో చీకటిరేవుకు కల్వర్టు, సీసీరోడ్డు కొట్టుకుపోయాయి. సమీపంలోని దాదాపు 15 ఎకరాల్లో పంటలు నీటమునగడంతోపాటు ఇసుక మేటలు వేయడంతో రైతులు నష్టపోయారు. నిర్మల్‌రూరల్‌ మండలంలోని కౌట్ల(కె) నుంచి జాఫ్రాపూర్‌ వెళ్లే దారిలో గల తోళ్లమడుగు ఒర్రె ఉప్పొంగడంతో రెండు గ్రామాల మధ్య రోడ్డు కొట్టుకుపోయింది. ఇటీవల వర్షాలకు సోన్‌ మండలంలోనే వెల్మల్‌ గ్రామ సమీపంలో సరస్వతీ కెనాల్‌ కట్ట కూడా కోతకు గురైంది.

చెక్‌ చేయాల్సిందే..

జిల్లాలో 2021 నుంచి భారీ వర్షాలు ప్రతీసీజన్‌లో భయపెడుతూనే ఉన్నాయి. స్థానికంగా కురుస్తున్న వర్షాలకుతోడు ఎగువన మహారాష్ట్ర నుంచి భారీగా వరదలూ వస్తున్నాయి. అయితే.. చాలా వరకు జిల్లాయంత్రాంగం ప్రాజెక్టులపైనే దృష్టిపెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీజన్‌లో తెగుతున్న చెరువులు తమపైనా దృష్టిపెట్టాలని, తరచూ చెక్‌ చేయాలన్న విషయాన్ని గుర్తుచేస్తున్నాయి. ఇవేకాకుండా నిర్మల్‌ సబ్‌ డివిజన్‌లో మరికొన్ని చెరువులూ ప్రమాదకరంగానే ఉన్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

సారంగపూర్‌ మండలం బోరిగాం వద్ద దెబ్బతిన్న కల్వర్టు, సీసీరోడ్డు

చెరువులు, ఆయకట్టు వివరాలు..

డివిజన్‌ చెరువుల ఆయకట్టు

సంఖ్య (ఎకరాల్లో)

నిర్మల్‌ 262 27,336

భైంసా 355 32,464

ఖానాపూర్‌ 174 12,835

మొత్తం 791 72,635

నిర్మాణ లోపాలతోనే గండ్లు..?

ఎప్పుడూ లేనంతగా ఇటీవల చెరువులు కోతలకు గురవుతుండటం ఆయకట్టు రైతులతోపాటు జిల్లా అధికారులనూ కలవర పెడుతున్నాయి. గతంలో ఇంతకంటే భారీ వర్షాలు కురిసినా తట్టుకున్న చెరువు కట్టలు ఇప్పుడు తెగడం చర్చనీయాంశమైంది. ఇటీవల మరమ్మతులు చేసిన, కొత్త తూములను నిర్మించిన ప్రాంతాల్లో కోతలు, గండ్లు పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తూముల నిర్మాణం చేపట్టిన చోట కేవలం మొరం వేసి ఉంచడం, పైనుంచి రాళ్లు వేయకపోవడంతోనే కొట్టుకుపోయే పరిస్థితి వచ్చినట్లు పేర్కొంటున్నారు. జిల్లాకేంద్రంలోని బంగల్‌పేట్‌ చెరువు వద్దా అదే పరిస్థితి కనిపించడంతో స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

మరమ్మతులు చేపడుతున్నాం..

భారీ వర్షాలకు జిల్లాలో పలు చెరువులు కోతకు గురయ్యాయి. మొత్తం 63 చోట్ల నీటివనరులు దెబ్బతిన్నట్లు గుర్తించాం. రూ.45 లక్షల అంచనాతో ఇప్పటికే తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నాం. శాశ్వత మరమ్మతులకు రూ.2 కోట్ల అంచనాతో నివేదిక రూపొందించాం.

– అనిల్‌, ఈఈ, ఇరిగేషన్‌

కట్టలు తెగుతున్నయ్‌!1
1/2

కట్టలు తెగుతున్నయ్‌!

కట్టలు తెగుతున్నయ్‌!2
2/2

కట్టలు తెగుతున్నయ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement