
ఎత్తిపోతల పథకాలకు మహర్దశ
సారంగపూర్: మండలంలోని బీరవెల్లి, ఆలూరు గ్రామాల రైతుల ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. ఈ గ్రామాల ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బీరవెల్లి ఎత్తిపోతల పథకం ద్వారా 370 ఎకరాలకు, ఆలూరు ఎత్తిపోతల పథకం ద్వారా 400 ఎకరాలకు సాగునీరు అందేది. ఈ పథకాల సాయంతో రైతులు రెండు పంటలు పండించి సంతోషంగా ఉండేవారు. నిర్వహణను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, మోటార్లు మరమ్మతులకు రావడంతో ఈ పథకాలు అలంకారప్రాయంగా మారాయి. దీంతో, సాగునీరు అందక ఆయకట్టు రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది రైతులు అప్పులు చేసి బోరుబావులు వేయించుకోగా, మరికొంతమంది వానాకాలం పంటలకే పరిమితమయ్యారు. యాసంగి పంటలకు నీరు అందించే ఎత్తిపోతల పథకాలు పనిచేయకపోవడంతో రైతులు ఎనిమిదేళ్లుగా నిధుల కోసం ఎదురుచూశారు.
నిధుల విడుదలతో రైతుల్లో ఆనందం..
ప్రభుత్వం ఇటీవల బీరవెల్లి లిఫ్ట్ మరమ్మతులు, పునరుద్ధరణ కోసం రూ.69.10 లక్షలు, ఆలూరు లిఫ్ట్‌కు రూ.32.50 లక్షలు విడుదల చేసింది. ఈమేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధుల విడుదలతో ఆయా గ్రామాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిదేళ్ల నిరీక్షణ అనంతరం, ఇకపై తమ పంట భూములకు రెండు పంటలకు సరిపడా సాగునీరు అందుతుందని రైతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
బాసర ఎత్తిపోతల పథకానికి నిధులు
బాసర: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల బాసరకు వచ్చారు. మండలంలోని రైతులు, మండల అధ్యక్షుడు మమ్మాయి రమేశ్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సంబంధించిన సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పరిష్కరించాలని కోరారు. మంత్రి స్పందించి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి స్పందించి బాసర ఎత్తిపోతల పథకానికి రూ.1.25 కోట్లు మంజూరు చేశారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రమేశ్ తెలిపారు. దీంతో 3 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. మంత్రులు జూపల్లి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఎత్తిపోతల పథకాలకు మహర్దశ