
బాసరలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు!
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లను కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం పరిశీలించారు. ఈవో, ఆలయ అధికారులు, అర్చకులతో సమీక్ష చేశారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆలయ పరిసరాలను అధికారులు, పూజారులతో కలిసి పరిశీలించారు.
అధికారులతో సమీక్ష..
అనంతరం, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తుల రద్దీ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించారు. క్యూలైన్లు, వీఐపీ దర్శన వ్యవస్థ, అక్షరాభ్యాస మండపాలు, లడ్డూ కౌంటర్లు, సీసీటీవీ కెమెరాలు, అన్నదానం, తాగునీరు, వసతి సౌకర్యాలను సమీక్షించి, అధికారులకు కీలక సూచనలు ఇచ్చారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నిర్వహణ, భద్రత, శానిటేషన్, ఆరోగ్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. లైటింగ్, పార్కింగ్, పూల అలంకరణ, పెయింటింగ్, నిరంతర శానిటేషన్, మొబైల్ టాయిలెట్లు, వైద్య శిబిరాలు, పోలీస్ భద్రత, గోదావరి ఘాట్‌ల వద్ద సౌకర్యాలు కల్పించాలని ఆయా శాఖల అధికారును ఆదేశించారు. రహదారుల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శరత్ పటాక్, ఏఎంసీ చైర్మన్ ఆనంద్‌రావ్ పటేల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఈవో అంజనాదేవి, డీపీవో శ్రీనివాస్, తహసీల్దార్ పవనచంద్ర, పోలీస్, ఫైర్ అధికారులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కలెక్టర్ అభిలాష అభినవ్
ఆలయ పరిసరాలు పరిశీలిస్తున్న కలెక్టర్..

బాసరలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు!