
బోధనోత్తములు
నిబద్ధత, వినూత్న పనివిధానం ఉంటే.. ఏ వృత్తిలో అయినా రాణించవచ్చు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం బోధనలో వినూత్న విధానం అవలంబించే ఉపాధ్యాయులకు ఏటా పురస్కారాలు అందిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను ప్రకటించింది. ఇందులో జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు వినూత్న బోధనతో రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారానికి ఎంపికయ్యారు.
యూట్యూబ్ చానల్ ద్వారా ఆన్‌లైన్ పాఠాలు..
మామడ: మండలంలోని పొన్కల్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పీజీహెచ్‌ఎం మైస అరవింద్‌కుమార్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. పాఠశాల విద్యార్థుల ప్రతిభ ప్రపంచానికి తెలిసే విధంగా అరవింద్ మైసవ్లోగ్స్ అనే యూట్యూబ్ చానల్ ఏర్పాటు చేశారు. వారికి అవసరమైన విద్యాసమాచారాన్ని అందులో నిక్షిప్తం చేయడంతో పాటు విలువైన సమాచారం అందిస్తున్నారు. ఇదే పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు ఉపాధ్యాయులు గతేడాది జిల్లాస్థాయి ఉత్తమ అవార్డు అందుకున్నారు. నాలుగేళ్లుగా పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. పలువురు విద్యార్థులు సాహిత్యం, సైన్స్‌ఫేర్‌లో జిల్లా, రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారు. ఈ ఏడాది పాఠశాలలో పదోతరగతి పూర్తి చేసిన ఇద్దరు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. పాఠశాలలో ఎన్‌సీసీ నిర్వహణతో విద్యార్థుల్లో దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, సేవాభావం పెంపొందించేలా క్రమశిక్షణతో కూడిన వాతావరణం కల్పిస్తున్నారు. డ్రాపౌట్స్‌ను తగ్గించేందుకు పోషకులతో సమావేశం ఏర్పాటుచేసి విద్యార్థుల ప్రగతిని వివరిస్తూ సమస్యను అధిగమించారు. విద్యార్థుల పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటించి వాటిని సంరక్షించేలా పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది.

బోధనోత్తములు