ఉద్యాన రైతులకు ఊతం..!
● పండ్ల తోటలు, కూరగాయల సాగుకు ప్రోత్సాహం ● ఉద్యానశాఖ ప్రణాళిక సిద్ధం
మామడ: పండ్ల తోటలు, కూరగాయలు, ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు 2025–26 కోసం ఉద్యాన శాఖ ద్వారా సమగ్ర ప్రణాళికను రూపొందించింది. సమీకృత అభివృద్ధి మిషన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్, జాతీయ వెదురు మిషన్ నిధులతో జిల్లాలో 250 ఎకరాల్లో పండ్ల తోటల సాగును ప్రోత్సహించేందుకు అధికారులు రైతులకు అవగాహ న కల్పిస్తున్నారు. రాయితీలు, పరికరాల సబ్సి డీలతో రైతుల ఆర్థిక భారం తగ్గించి, ఉద్యాన రంగంలో ఉత్పాదకతను పెంచడమే లక్ష్యం.
పండ్ల తోటలకు సబ్సిడీ..
సమీకృత అభివృద్ధి మిషన్ ద్వారా మామిడి, నిమ్మ, జామ, బత్తాయి తోటల సాగుకు హెక్టారుకు రూ.48 వేలు నాలుగేళ్లలో అందిస్తారు. డ్రాగన్ ఫ్రూట్, అరటి, బొప్పాయి సాగుకు ఎకరానికి రూ.7,200 సబ్సిడీ ఉంటుంది. ప్లాస్టిక్ మల్చింగ్, నీటి కుంటలు, వర్మీ కంపోస్ట్ యూనిట్‌లకు 50% రాయితీ, 70 కిలోల సామర్థ్యం గల సోలార్ క్రాప్ డ్రైయర్(రూ.2.50 లక్షలు)కు 40% రాయితీతో రూ.లక్షకు అందుబాటులో ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 55% రాయితీ అందిస్తారు.
కూరగాయల సాగుకు ప్రోత్సాహం
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద దొండ, కా కర, బీర, సొరకాయ వంటి తీగజాతి కూరగా యల సాగుకు పందిళ్ల నిర్మాణానికి ఎకరానికి రూ.లక్ష సబ్సిడీ ఇస్తారు. బిందు, తుంపర సేద్య పరికరాలకు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100%, సన్నకారు రైతులకు 90%, 5 ఎకరాలకు పైగా భూ మి ఉన్నవారికి 80% రాయితీ ఉంటుంది. వెదు రు సాగుకు ఎకరానికి రూ.24,000 అందిస్తారు.
ఆయిల్‌పామ్ సాగుకు..
ఆయిల్‌పామ్ సాగుకు 90% సబ్సిడీతోపాటు, తోటల సంరక్షణ, అంతర పంటల సాగుకు ఎకరానికి రూ.2,100 చొప్పున నాలుగేళ్లపాటు అందిస్తారు. ఈ చర్యలు రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు, ఉద్యాన రంగంలో స్థిరత్వాన్ని సాధిస్తాయి.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి..
పండ్ల తోటలు, కూరగాయలు, ఆయిల్‌పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా సాగు కు ముందుకు వచ్చే రైతులకు ప్రొత్సాహకాలు అందిస్తున్నారు. ఈ యేడాది జిల్లాలో ఉద్యానసాగును పెంచేందుకు రైతులకు సాగుపై అవగాహన కల్పిస్తున్నాం. రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– బీవీ.రమణ, జిల్లా ఉద్యాన,
పట్టుపరిశ్రమ శాఖ అధికారి
ఉద్యాన రైతులకు ఊతం..!


