
ఏపీ పోలీసుల తీరుపై జర్నలిస్టుల నిరసన
నిర్మల్: నిజాలను నిక్కచ్చిగా, వాస్తవాలను ఉన్నవి ఉన్నట్లుగా ప్రచురిస్తున్న వార్తాపత్రికలపై ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలు చేపట్టడం సరికాదని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీసులు ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలో సోదాలు జరపడంపై అన్ని జర్నలిస్టు సంఘాలు, నిర్మల్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలో నిరసన తెలిపారు. విశ్రాంతి భవనం నుంచి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. కలెక్టర్ అభిలాష అభినవ్‌కు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. రాజకీయపరమైన కక్ష సాధింపు చర్యలను జర్నలిస్టులపై చేపట్టడం దారుణమన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వాలే ఇలా పోలీసులతో కక్ష సాధింపులు చర్యలకు చేపట్టడం సరికాదని పేర్కొన్నారు. తమ నిరసనను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడేలా చూడాలని కలెక్టర్ అభిలాష అభినవ్‌ను కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వంతోపాటు సమాచార పౌరసంబంధాలశాఖ దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ తెలిపారు. నిరసనలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐజేయూ), తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(143), తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్, మున్నూరు కాపు జర్నలిస్టు యూనియన్, తెలుగు ప్రింట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్, నిర్మల్ ప్రెస్‌క్లబ్, తదితర సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు మెమోరాండం

ఏపీ పోలీసుల తీరుపై జర్నలిస్టుల నిరసన