
రాయితీకి నో..
ఎల్‌ఆర్ ఎస్..
● జిల్లాలో దరఖాస్తుదారుల స్పందన అంతంతే.. ● మూడుసార్లు పెంచినా నెరవేరని ప్రభుత్వ లక్ష్యం ● 44,602 దరఖాస్తులు..ఫీజు చెల్లించింది 7,256 మాత్రమే
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్) కింద అనధికార లేఔట్లలోని స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన 25 శాతం రాయితీ గడువు ముగిసినా ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. మార్చి, 31, ఏప్రిల్ 30, మే 3 వరకు మూడుసార్లు గడువు పొడిగించినా, స్థల యజమానులు పెద్దగా ముందుకు రాలేదు. జిల్లా వ్యాప్తంగా మూడు మున్సిపాలిటీలు, 18 మండలాల్లో కలిపి కేవలం రూ.14.40 కోట్ల ఆదాయం సమకూరింది. 2020లో రూ.1,000 ఫీజుతో దరఖాస్తు చేసుకున్నవారి క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ, తక్కువ స్పందనతో లక్ష్యాలు చేరలేదు.
దరఖాస్తులు, ఫీజు చెల్లింపులు..
జిల్లా వ్యాప్తంగా మొత్తం 44,602 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు అందగా, 37,939 దరఖాస్తులు ఫీజు చెల్లింపునకు అర్హత పొందాయి. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల పరిధిలో 26,537 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 21,850 అర్హత పొందగా, 4,026 మంది ఫీజు చెల్లించారు, రూ.8.27 కోట్ల ఆదాయం సమకూరింది. 18 మండలాల్లో 18,065 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 16,089 అర్హత పొందగా, 3,230 మంది ఫీజు చెల్లించారు. రూ.6.13 కోట్ల ఆదాయం జమ అయింది. నిర్మల్ మున్సిపాలిటీ రూ.7.02 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది, ఖానాపూర్‌లో కేవలం రూ.3 లక్షల ఆదాయం వచ్చింది.
పత్తాలేని ప్రొసీడింగ్స్..
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన వారు ప్రొసీడింగ్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. గతంలో టౌన్ ప్లానింగ్ అధికారుల ఆమోదం సరిపోగా, ఇప్పుడు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అంగీకారం కూడా తప్పనిసరి. ఈ మూడు శాఖల ధ్రువీకరణ పూర్తయితేనే క్రమబద్ధీకరణ పత్రాలు జారీ అవుతాయి, దీనివల్ల ఆలస్యం, ఇబ్బందులు తప్పడం లేదు. రాయితీ గడువు ముగిసిన నేపథ్యంలో, మరోసారి గడువు పొడిగించే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
నెరవేరని లక్ష్యం..
ఎల్‌ఆర్‌ఎస్ పథకం ద్వారా అనధికార లేఔట్లను క్రమబద్ధీకరించి, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలన్న లక్ష్యం నెరవేరలేదు. అధిక ఫీజులు, సంక్లిష్ట పరిశీలన ప్రక్రియ, ప్రజల్లో అవగాహన లేమి స్పందన తగ్గడానికి కారణాలుగా అధికారులు గుర్తిస్తున్నారు. సరళమైన ప్రక్రియలు, అవగాహన కార్యక్రమాలతో ఈ పథకాన్ని మరింత ప్రజాదరణ పొందేలా చేయాలని స్థానికులు కోరుతున్నారు.
వివరాలు..
మున్సిపాలిటీలు, మండలాల వారీగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల వివరాలు
జిల్లా వ్యాప్తంగా
వచ్చిన దరఖాస్తులు 44,602
ఫీజు చెల్లింపునకు అర్హులు 37,939
ఫీజు చెల్లించిన వారు 7256
ప్రొసీడింగ్ పొందినవారు 2,455
సమకూరిన ఆదాయం
రూ.14.40 కోట్లు

రాయితీకి నో..