జన్నారం: కడుపునొప్పి భరించలేక పురుగుల మందు మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మృత్యుంజయ సర్కార్, మృతురాలి తల్లి గంగమ్మ తెలిపిన వివరాల ప్రకారం బోథ్ మండలం కరత్వాడ గ్రామానికి చెందిన ఈదుల్ల గంగమ్మ, అడెళ్లు దంపతుల కుమార్తె నవ్య (28)కు జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన గద్దల శ్రీనివాస్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. దంపతులకు ఇద్దరు సంతానం. ఉట్నుర్ ఆర్డీవో కార్యాలయంలో ఎస్‌వోగా పనిచేస్తున్న నవ్య కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయంకాలేదు. ఈ నెల 10న కడుపునొప్పి తీవ్రం కావడంతో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు ముందుగా జన్నారం, అక్కడి నుంచి మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.