
వివరాలు వెల్లడిస్తున్న కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
● ముగిసిన ఉపసంహరణ గడువు ● అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
నిర్మల్‌చైన్‌గేట్/భైంసా/ముధోల్: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. జిల్లాలోని నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల ఉపసంహరణ చివరిరోజైన బుధవారం తొమ్మిది మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 38 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నిర్మల్ నియోజకవర్గంలో 13 మంది, ముధోల్ నియోజకవర్గంలో 14 మంది, ఖానాపూర్ నియోజకవర్గంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఉపసంహరణలు ఇలా..
నిర్మల్ నియోజకవర్గం నుంచి ముస్కు సతీశ్‌రెడ్డి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ముధోల్ నియోజకవర్గానికి నామినేషన్ వేసినవారిలో నల్ల రవికుమార్, మహ్మద్ హుస్సేన్, పత్తిరెడ్డి విజయకుమార్‌రెడ్డి, బెజ్జంకి ముత్యంరెడ్డి, పీ ప్రమోద్‌రెడ్డి, బుజిగే పెద్దోల్ల వీరేశం పోటీ నుంచి విత్‌డ్రా అయ్యారు. ఖానాపూర్ బరి నుంచి చౌహాన్ సేవాదాస్, జాదవ్ రవికిరణ్ తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
అభ్యర్థులకు కేటాయించిన గుర్తులివే..
ముధోల్ నియోజకవర్గంలో బరిలో నిలిచినవారికి అధికారులు గుర్తులు కేటాయించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి గడ్డిగారి విఠల్‌రెడ్డికి కారు గుర్తు, కాంగ్రెస్ అభ్యర్థి భోస్లే నారాయణ్‌రావుపటేల్‌కు చేయి, బీజేపీ అభ్యర్థి పవార్ రామారావుపాటిల్‌కు కమలం, బీఎస్పీ అభ్యర్థి సర్దార్ వినోద్‌కుమార్‌కు ఏనుగు, ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థి కాసరం రాజుకు బ్యాటరీ టార్చ్, ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థి గోరేకర్ విజయ్‌కు ట్రంపెట్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి దేవిదాస్ అసుడేకు గ్యాస్ సిలిండర్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి బద్ధం భోజారెడ్డికి సింహం గుర్తు కేటాయించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కోమల్‌రెడ్డి తెలిపారు. అలాగే స్వతంత్య్ర అభ్యర్థులు ఎలుగుదర్ ప్రవీణ్‌కు సబ్బుడబ్బా, జాదవ్ దత్తురాంకు కెమెరా, జాదవ్ దేవిదాస్‌కు ఎయిర్ కండిషనర్, పోతరాజు సుధాకర్‌కు బేబీవాకర్, మన్‌మోహన్ జాదవ్‌కు చపాతి రోలర్, సంజూ హెంలేకు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment