ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా రాజీనామా

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు రాఘవ్ చద్దా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్‌కు అందజేశారు. పంజాబ్ నుంచి రాజ్యసభకు పంపాలని ‘ఆప్’ నిర్ణయించడంతో ఎమ్మెల్యే పదవిని రాఘవ్ చద్దా వదులుకున్నారు.
‘ఢిల్లీ విధానసభకు నేను రాజీనామా చేశాను. సభాపతితో సహా సభ్యులందరూ నన్ను ఎంతో ఆదరించారు. పంజాబ్ తరపున రాజ్యభలో బలంగా గళం వినిపిస్తాను. పంజాబ్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాన’ని రాఘవ్ చద్దా ఏఎన్‌ఐ వార్తా సంస్థతో చెప్పారు.
ఐదుగురు అభ్యర్థులు
రాఘవ్ చద్దాతో పాటు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, ఐఐటీ ప్రొఫెసర్ సందీప్ పాఠక్, విద్యావేత్త అశోక్ కుమార్ మిట్టల్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాలను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ్య అభ్యర్థులుగా మార్చి 21న ప్రకటించింది. పంజాబ్‌లో ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఏప్రిల్ 9న ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఎన్నికలు నిర్వహించనున్నారు. (క్లిక్: పంజాబ్ సీఎం సంచలన ప్రకటన)
యంగెస్ట్ ఎంపీ!
33 ఏళ్ల రాఘవ్ చద్దా.. రాజ్యసభలో అతి పిన్న వయస్కుడైన సిట్టింగ్ సభ్యునిగా గుర్తింపు పొందనున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంచార్జిగా ఆయన వ్యవహరించారు. వృత్తిరీత్యా చార్టెట్ అకౌంటెంట్ అయిన చద్దా.. ఢిల్లీ లోక్‌పాల్ బిల్లు రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. పంజాబ్ నుంచి రాజ్యసభకు నామినేటైన చద్దాకు ఆ రాష్ట్రంలో గట్టి పట్టుంది. (క్లిక్: రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు)