ఉడాన్ లక్ష్యాలకు విరుద్ధంగా విమాన చార్జీల భారం
ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవాలి
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్– తిరుపతి మార్గంలో విమాన చార్జీల పెంపుపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఉడాన్’ లక్ష్యాల్లో ఒకటైన ‘సామాన్యుడికి విమానయానం’ ఆశయానికి విరుద్ధంగా ఈ చార్జీల బాదుడు కొనసాగుతోందని మండిపడ్డారు. పెరిగిన విమాన చార్జీలపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి ఎంపీ లేఖ రాశారు. లేఖలో ముఖ్యాంశాలు.. దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే తిరుపతికి వెళ్లే విమాన ప్రయాణం అత్యంత ఖరీదుగా మారింది.
దీనిప్రకారం హైదరాబాద్ నుంచి గోవా (రూ.3,000–రూ.6,500), ఢిల్లీ (రూ.3,900–రూ.7,000), చెన్నై (రూ.2,500–రూ.4,000)కు ఉన్న చార్జీల కంటే తిరుపతి రూట్‌లోనే అత్యధికంగా వసూలు చేస్తున్నారు. హైదరాబాద్–తిరుపతి మధ్య కనీస చార్జీ రూ.6,000 నుంచి ప్రారంభమై రూ.9,500 వరకు ఉంటోంది. కొన్ని సందర్భాల్లో ఇది రూ.14,500కు చేరుతోంది. ఇక 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు 13,367 విమానాల్లో దాదాపు 11.84 లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్–తిరుపతి రూట్‌లో ప్రయాణించారు.
కేవలం మార్చి 2026లోనే 864 విమాన సర్విసుల ద్వారా 88 వేల మందికిపైగా ప్రయాణించారు. రోజుకు ఈ రూట్‌లో 16 నుంచి 17విమానాలు నడుస్తున్నాయంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ విమానయాన సంస్థలు తెలివిగా పెద్ద విమానాల సంఖ్యను తగ్గించి, చిన్న విమానాలను నడుపుతూ సీట్ల కొరతను సృష్టిస్తున్నాయి. తద్వారా చార్జీలు పెంచి భక్తులను దోచుకుంటున్నారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల్లో అత్యధికులు మధ్యతరగతి వారు, వృద్ధులు ఉంటారు. వారిపై ఆరి్థక భారం మోపడం అన్యాయం.


