ఎన్నాళ్లిలా:  చచ్చినా గౌరవం లేదు

Women Face Molestation World Wide From Men - Sakshi

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః... ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారన్నది నానుడి. పూజల మాటేమోగాని..  చచ్చినా కనీస గౌరవం ఇవ్వడంలేదు ఈ సమాజం! మొన్న నిర్భయ... నిన్న ప్రియాంకారెడ్డి.. తాజాగా హాథ్రస్‌ యువతి.. మహిళలపై హత్యాచారాలు, బెదిరింపులు, వేధింపులు... మన దేశానికి మాత్రమే పరిమితం కాదు.. కానీ... అతి ప్రాచీన సంస్కృతిగా గొప్పలు చెప్పుకుంటున్న భారతావనిలో ఇలాంటి ఘటనలు ఏటికేడాది పెరిగిపోతూ ఉండటం మాత్రం ఆందోళన కలిగించే విషయమే. మహిళల రక్షణ విషయంలో మనం చేస్తున్నదేమిటి? చేయాల్సిందేమిటి? అన్నది ఒక్కసారి తరచి చూస్తే..

ప్రతి ముగ్గురు మహిళల్లో ఒక్కరు లైంగిక, భౌతిక హింస ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. దేశాలకతీతంగా ఇది జరుగుతోంది. అయితే వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ అకృత్యాల ప్రభావం నేటి మహిళపై ఏమిటి? అంటే.. వారి కదలికలపై ఆంక్షలకు కారణమైంది. వారి స్వేచ్ఛకు అన్ని రకాల పరిమితులు, పరిధులు ఏర్పాటు చేసింది. ఇది ఆయా మహిళలకు మాత్రమే నష్టం చేకూర్చడం లేదు. సమాజం మొత్తానికి తీవ్రమైన లోటుగా మారిందనడం అతిశయోక్తి కాదు. ఆడపిల్లలు తమ సామర్థ్యం మేరకు చదువు పూర్తి చేసుకోగలిగినా, నచ్చిన వృత్తి, ఉద్యోగాలను నెరపగలిగినా కుటుంబం పరిస్థితి, సమాజం తీరుతెన్నులు మరోలా ఉంటాయనడంలో సందేహం లేదు. (న్యాయం జరిగేదాకా పోరుబాటే)

2018లో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ జారీ చేసిన జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌లో భారత్‌ ర్యాంకు 108. అంతకు మునుపటి ఏడాది కూడా మన స్థాయి ఇంతే. ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం, అవకాశం, రాజకీయ సాధికారత, విద్య, ఆరోగ్య సేవలు వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సిద్ధం చేసే ఈ జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌లో భారత్‌ ఏమాత్రం ముందుకు వెళ్లినా.. అది మన స్థూల జాతీయోత్పత్తిని అమాంతం పెంచేస్తుందని అంచనా. ఇదంతా ఎందుకూ అంటే.. మహిళల భద్రత, వారి చదువు సంధ్యలు మన సంస్కారాన్ని చాటుకునేందుకు మాత్రమే కాదు.. భారత్‌ విశ్వగురువుగా ఎదగాలన్న వారి ఆశలకూ అత్యవసరమని చెప్పేందుకు! ’(ఢిల్లీలో ప్రియాంకా గాంధీ ధర్నా)

ఆ(యా)ప్‌కే సాథ్‌!
మహిళల భద్రత అనేది భారత్‌కు మాత్రమే సంబంధించిన అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిదేశంలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. ఆడబిడ్డలను సురక్షితంగా ఉంచేందుకు వినూత్న టెక్నాలజీల అభి వృద్ధి కూడా పలు దేశాల్లో జరుగుతోంది. స్మార్ట్‌ఫోన్‌  సాయంతో విపత్కర పరిస్థితుల్లో మహిళలు కుటుంబ సభ్యులను, పోలీసులను అలర్ట్‌ చేసేందుకు పలు అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లో మచ్చుకు కొన్ని ఇలా ఉన్నాయి... 

నమోలా : దక్షిణాఫ్రికాలో రూపొందించిన అప్లికేషన్‌ ఇది. పోలీసులే కాకుండా.. అగ్నిమాపక దళం, అంబులెన్‌ వంటి అత్యవసర సేవలన్నింటినీ అందుబాటులోకి తెస్తుంది. మీరున్న ప్రాంతాన్ని దగ్గరివారితో పంచుకునేందుకు అవకాశం ఉండటం ఈ అప్లికేషన్‌ లోని ఒక అంశం. మీరు కలవాల్సిన ప్రాంతానికి బంధుమిత్రులు ముందుగానే వచ్చినా.. వారు ప్రయాణం ప్రారంభించినా ఆ సమాచారం మీకు చేరిపోతుంది. అప్లికేషన్‌ లోనే ఓ ప్యానిక్‌ బటన్‌  కూడా ఏర్పాటు చేశారు. దీన్ని ఒత్తితే చాలు.. పోలీసులకు మీరున్న ప్రాంత వివరాలు తెలుస్తాయి. మీరు కష్టాల్లో ఉన్నారన్న విషయమూ తెలిసిపోతుంది. లక్షకుపైగా డౌన్‌లోడ్‌లు ఉన్న ఈ అప్లికేషన్‌  రేటింగ్‌ 4.75/5 గా ఉంది. 

కవలన్‌ ఎస్‌ఓఎస్‌ : తమిళనాడు పోలీసులు రూపొందించిన స్మార్ట్‌ఫోన్‌  అప్లికేషన్‌  ఇది. ఈవ్‌ టీజింగ్, కిడ్నాప్‌ వంటి పరిస్థితుల్లో పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ను సంప్రదించేందుకు వీలు కల్పిస్తుంది. ఫేక్‌ కాల్స్‌ను నివారించేందుకు తద్వారా పోలీసుల విలువైన సమయాన్ని కాపాడేందుకు కూడా ఈ అప్లికేషన్‌ లో ఏర్పాట్లు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు ఎంపిక చేసుకున్న నంబరుకు మీరున్న ప్రాంతాన్ని చేరవేస్తుంది. ఆఫ్‌లైన్‌  మోడ్‌లోనూ పనిచేస్తుంది. ఎస్‌ఎంఎస్‌ల రూపంలో సమాచారం పంపిస్తుంది. ఎస్‌ఓఎస్‌ మీట నొక్కగానే ఫోన్‌  వెనుక భాగంలోని కెమెరా ద్వారా వీడియో రికార్డింగ్‌ మొదలవుతుంది. ఈ అప్లికేషన్‌కు 10 లక్షలకుపైగా డౌన్‌ లోడ్‌లు ఉన్నాయి. 

గ్రానస్‌ : మహిళలు, పిల్లలకు అత్యవసర వైద్యసాయం అందించేందుకు రూపొందించిన అప్లికేషన్‌  ఇది. ప్రమాదాలు జరిగినప్పుడు లేదా రక్తం అత్యవసరమైనప్పుడు ఈ అప్లికేషన్‌  ఎంతో ఉపయోగపడుతుంది. భారత్‌లో తయారైన ఈ అప్లికేషన్‌ ను ఇప్పటివరకూ 50వేల మందికిపైగా డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. అత్యవసరమైనప్పుడు లేదా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు స్వచ్ఛంద సంస్థలను సంప్రదించేందుకు ఇందులో సౌకర్యం ఉంటుంది. గ్రానస్‌కు అనుబంధంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆపదలో ఉన్న మహిళతో మాట్లాడి అత్యవసర సాయం అందిస్తారు. రక్తం అవసరమైన వారిని, దాతలను కలిపే ఓ ప్లాట్‌ఫాం ఇది. స్మార్ట్‌ఫోన్‌  లేని వారి కోసం ఓ టోల్‌ ఫ్రీ నంబర్‌ కూడా అందుబాటులో ఉంది. తప్పిపోయిన పిల్లలను గుర్తించేందుకు ప్రత్యేకమైన కార్యకర్తల బృందం ఒకటి పనిచేస్తూ ఉండటం విశేషం. 

ఎక్కడుంది సమస్య?
పితృస్వామ్య వ్యవస్థ మొదలుకొని, మన నగరాల్లోని చిన్న చిన్న విషయాల వరకూ అనేక అంశాలు ఈ దేశంలో మహిళల అస్తిత్వాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. చిన్నప్పటి నుంచి అన్ని అంశాల్లోనూ మగపిల్లలకు అధిక ప్రాధాన్యం కల్పించడం.. వారిలో ఆడవారిపై ఒక రకమైన తేలిక భావాన్ని సృష్టిస్తుందని పలువురు సామాజిక నిపుణులు స్పష్టం చేశారు. ప్రతి లక్ష మందికి 125 మంది పోలీసులు మాత్రమే ఉన్న అతి తక్కువ దేశాల్లో భారత్‌ కూడా ఒకటి కావడం మహిళల భద్రతపై ప్రభావం చూపుతున్న అంశాల్లో రెండోది. భారత్‌లో రోజూ కనీసం 67 మంది అత్యాచారానికి గురవుతున్నారని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. మహిళలపై హింస అంటే అది లైంగికమైందే అన్న స్థితికి భారత్‌ చేరుకుంది. ఫలితంగా భార్యపై భర్త భౌతికంగా దాడి చేయడం సాధా రణమైన అంశంగా మారిపోయింది. చాలా కేసులు పోలీసుల దృష్టికి రాకుండానే తెరమరుగు అవుతూ ఉంటాయి.  

చిన్న చిన్న పనులతో పెద్ద తేడా..
ప్రభుత్వం కొన్ని చిన్న చిన్న పనుల ద్వారా కొంత మార్పును తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు. 2012 నాటి నిర్భయ ఘటనలో అత్యాచారానికి పాల్పడ్డ వారికి మరణ శిక్ష విధించినా.. కేసుల విచారణలో జాప్యం, దోషిగా నిరూపణ అయ్యే అవకాశాలు తక్కువగా ఉండటం వంటి అంశాల్లో మార్పు రావాల్సి ఉంది. అత్యాచార నేరాలకు ప్రత్యేక కోర్టులు, చట్టాలను ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేసింది. నగరాల్లో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని మార్పులు చేయడంతో మంచి ఫలితాలను ఇస్తుందని అంటున్నారు నిపుణులు. ఉదాహరణకు బస్టాపులన్నింటిలో వీధి దీపాల వెలుతురు ఉండేలా జాగ్రత్త పడటం లేదా ఏకాంత ప్రదేశాల్లో కాకుండా.. కొద్దోగొప్పో జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాలకు బస్టాపులను తరలించడం.

దీంతోపాటు శివారు ప్రాంతాల్లోనూ అన్ని వీధుల్లో దీపాలు ఏర్పాటు చేయడం మహిళల భద్రత విషయంలో ప్రభావశీలిగా ఉంటుందని అంచనా. 2008 నాటి ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో పొదుపు లక్ష్యంగా అమెరికాలో వీధి దీపాల వెలుగును తగ్గిస్తే చాలా నగరాల్లో మహిళలపై హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, బహిరంగ ప్రదేశాల్లో మహిళల అవసరాలు తీర్చే ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటివి కూడా మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలను తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడతాయి.

మరచిపోలేని నిర్భయలు..
2013, ముంబై: శక్తి మిల్స్‌ సామూహిక అత్యాచారం. ఓ కౌమార వయస్కుడితోపాటు ఐదుగురు జరిపిన అమానవీయ ఘటన. 
2014, ఉత్తరప్రదేశ్‌: బడావ్‌ సామూహిక అత్యాచారం కేసులో ఏడుగురు నిందితులు ఉన్నారు. 
2016, రాజస్తాన్‌: పదిహేడేళ్ల బాలికపై హాస్టల్‌ ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇది. బాధితురాలి మృతదేహం ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం సమీపంలోని నీటి కొలనులో ప్రత్యక్షమైంది. 
2017, ఉత్తరప్రదేశ్‌: ఓ మైనర్‌ బాలికపై ఉన్నావ్‌లో జరిగిన సామూహిక హత్యాచారం. బీజేపీ మాజీ సభ్యుడు కుల్దీప్‌ సింగ్‌ సెంగర్‌పై కేసు నమోదు. 2018, కథువా: జమ్మూకశ్మీర్‌లోని కథువాలో మైనర్‌ బాలికపై ఏడుగురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఐదు రోజుల తరువాత బాధితురాలి మృతదేహం లభ్యమయ్యింది. 
2020, మధ్యప్రదేశ్‌: బన్సీపురలో ఆరేళ్ల పాపను కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి కనుగుడ్లు పెకిలించే ప్రయత్నం చేశారని పోలీసులు చెప్పారు. కిడ్నాపైన కొన్ని గంటలకు కిలోమీటర్ల దూరంలో ఓ చెట్టుకు తాళ్లతో కట్టివేసిన పరిస్థితిలో ఈ బాలిక దొరికింది.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top