బిడ్డ కోసం కెరీర్‌ను కొనసాగించాలనుకోవడం క్రూరత్వం కాదు: సుప్రీం | Woman pursuing career canot be blamed for marriage breakdown: Supreme Court | Sakshi
Sakshi News home page

బిడ్డ కోసం కెరీర్‌ను కొనసాగించాలనుకోవడం క్రూరత్వం కాదు: సుప్రీం

May 13 2026 3:35 AM | Updated on May 13 2026 3:35 AM

Woman pursuing career canot be blamed for marriage breakdown: Supreme Court

న్యూఢిల్లీ: విద్యావంతురాలైన మహిళ తన కెరీర్‌ను కొనసాగించాలని నిర్ణయించుకోవడం, తన బిడ్డకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని భావించడం క్రూరత్వం లేదా భర్తను నిర్లక్ష్యం చేయడంగా భావించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక మహిళ డెంటిస్ట్‌గా తన వృత్తిని కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడాన్ని క్రూరత్వంగా పేర్కొంటూ కుటుంబ న్యాయస్థానం తీర్పింవ్వగా గుజరాత్‌ హైకోర్టు సమర్ధించింది. ఈ తీర్పులను తిరోగమనవాదం, అతి సంప్రదాయవాద ధోరణిగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. రెండు కోర్టుల తీర్పులను కొట్టివేసింది.

భార్య వృత్తిపరమైన గుర్తింపు కేవలం భర్త ఇష్టాయిష్టాలకు లోబడి ఉండదని స్పష్టం చేసింది. వేరుగా ఉంటున్న భార్యాభర్తల పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మంగళవారం పైవ్యాఖ్యలు చేసింది. వివాహ బంధంతో రాజీపడే అవకాశం ఎంతమాత్రం లేదని మహిళ చేసిన వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. వివాహ బంధం పునరుద్ధరించలేనంతగా దెబ్బతిన్నదనే కారణంతో కింది కోర్టులు మంజూరు చేసిన విడాకుల ఉత్తర్వును సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే, ఈ విడాకులు మహిళ క్రూరత్వం లేదా పరిత్యాగం ఆధారంగా కాదని స్పష్టం చేసింది.

కేసు వివరాలివీ.. పిటిషనర్లయిన భర్త భారత ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ కాగా, భార్య దంత వైద్యురాలు. పుణెలో ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న డెంటిస్ట్‌కు 2009లో కల్నల్‌తో వివాహమైంది. పెళ్లయిన వెంటనే భర్త వెంట ఆమె సరిహద్దుల్లోని కార్గిల్‌కు వెళ్లారు. వారికి ఒక కుమార్తె పుట్టింది. బిడ్డకు ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తడంతో ప్రత్యేక వైద్యం కోసం అహ్మదాబాద్‌ వెళ్లారు. కుమార్తె వెంట ఉండిపోవాల్సి రావడంతో అహ్మదాబాద్‌లోనే డెంటల్‌ క్లినిక్‌ ఏర్పాటు చేసుకున్నారు. భర్తకు ఇది నచ్చలేదు. విషయం ఫ్యామిలీ కోర్టుకు, ఆపై హైకోర్టుకు వెళ్లింది. రెండు కోర్టులూ దీనిని భార్య కూరత్వంగానే పేర్కొన్నాయి. భర్త ఎక్కడ ఉద్యోగం చేస్తే భార్య కూడా అక్కడే నివసించడం తప్పనిసరి విధి అని ఫ్యామిలీ కోర్టు పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement