గడిచిన ఐదు రోజుల వ్యవధిలో చమురు సంస్థలు రెండు సార్లు పెట్రోలియం ఉత్పత్తుల రిటైల్ ధరలను పెంచాయి. నాలుగేళ్ల తర్వాత ఈ పెంపు ఇదే మొదటిసారి కాగా.. చమురు సంస్థలు మాత్రం తమ నష్టాలను పూడ్చుకునేందుకు ధరల పెంపు ఒక్కటే మార్గమని చెబుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక.. ఏ క్షణమైనా పెట్రోధరల బాదుడు ఉంటుందని అంతా ఊహించినా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక పరిస్థితులు మున్ముందు పెట్రో కష్టాలు తప్పవనే సంకేతాలిస్తున్నాయి.
కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లుగా.. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగడానికి వేర్వేరు కారణాలున్నాయి. విదేశీ మారక వ్యయం పెరగడం, రూపాయి విలువ విపరీతంగా నేలచూపు చూడడం.. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు.. ఇలా అన్నివైపుల నుంచి ముప్పు ముంచుకొస్తుండడంతో.. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దేశ ప్రజలకు పొదుపు మంత్రాన్ని బోధించారు.
ప్రధాని వ్యాఖ్యలు దేశం ఎదుర్కోబోయే లోతైన సమస్యలకు దర్పణం పడుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. మన దేశంలో పెట్రోధరలు అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా పెరగడానికి ప్రధాన కారణం.. మనవద్ద తగిన స్థాయిలో పెట్రోలియం, గ్యాస్ నిల్వలు లేకపోవడమే..! నిజానికి 1991 ఆర్థిక సంక్షోభం తర్వాత ఇంధన భద్రతపై అంతటా ఆందోళనలు మొదలయ్యాయి. దాని ఫలితంగానే భారత్ తన ఇంధన నిల్వలకు 39 మిలియన్ బ్యారెళ్ల సామర్థ్యంతో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను ఏర్పాటు చేసింది. దీన్నే స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వ్స్‌స్ అని అంటారు. 2000 సంవత్సరం తర్వాత దీనికి అధికారిక రూపాన్నిచ్చారు.
పెరుగుతున్న పెట్రోలియం అవసరాలు
భారత్‌లో పెట్రోలియం అవసరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు సగటున 5.5 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును భారత్ వినియోగిస్తోంది. ఈ లెక్కన.. దేశంలో ఉండే పెట్రోలియం రిజర్వ్స్ వారం రోజుల అవసరాలకే సరిపోతాయి. ఇక చమురు సంస్థల వద్ద ఉన్న నిల్వలు, దిగుమతి కవరేజీని కలిపితే.. మొత్తం నిల్వలు 70 రోజుల అవసరాలను మాత్రమే తీర్చగలుగుతాయి.
నిజానికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వాహన మార్కెట్‌గా ఉంది. అమెరికా, చైనా తర్వాత భారత్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఈ రెండు దేశాలతో పోలిస్తే.. భారత్ ఎక్కువగా ఇంధన భద్రత ముప్పును ఎదుర్కొనే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. 1973 చమురు సంక్షోభం తర్వాత అమెరికా భారీ స్థాయిలో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అక్కడి SPR సామర్థ్యం 714 మిలియన్ బ్యారెళ్లు. ఇది భారత నిల్వల కంటే దాదాపు 18 రెట్లు ఎక్కువ. చైనాలో ఈ సామర్థ్యం 900 మిలియన్ బ్యారెళ్లకు చేరింది.
ఈ రెండు దేశాలతో పోలిస్తే.. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల విషయంలో భారత్ చాలా వరకు వెనకబడి ఉంది. ఇప్పటికిప్పుడు లెక్కలను పరిశీలించినా.. అమెరికా వద్ద ప్రస్తుతం 400 మిలియన్ బ్యారెళ్ల మేర రిజర్వ్స్ ఉన్నాయి. అయితే.. రోజుకు 13 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తితో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉంది. చైనా అలా కాదు. ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడి ఉంది. అయితే.. కష్టకాలమొచ్చినా తట్టుకునేలా చైనా నిల్వలున్నాయి.
మన దేశంలో పరిస్థితి భిన్నం
చైనా ప్రభుత్వం గనక.. చమురు వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిస్తే.. పౌరులు తూచా తప్పకుండా పాటిస్తారు. మన దేశంలో పరిస్థితి భిన్నంగా ఉంది. LPG, LNG నిల్వల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. దేశంలో సుమారు 1.4 లక్షల టన్నుల LPG నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది. కానీ రోజువారీ వినియోగం మాత్రం భారీగా పెరుగుతోంది. LNG విషయంలోనూ భారత్ ప్రధానంగా పెట్రోనెట్ LNG, BPCL రీగ్యాసిఫికేషన్ టెర్మినళ్ల వద్ద ఉన్న నిల్వలపైనే ఆధారపడుతోంది. ఎరువుల తయారీలో కీలకమైన ఈ ఇంధనానికి దేశంలో భూగర్భ నిల్వ వ్యవస్థ లేదు. అమెరికా, చైనా వంటి దేశాలు భూగర్భ LNG నిల్వలపై భారీగా పెట్టుబడులు పెట్టాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఐరోపా సమాఖ్య కూడా రష్యా గ్యాస్‌పై ఆధారపడడాన్ని తగ్గించుకుని, కొత్త వ్యూహాలను అందిపుచ్చుకుంది.
చమురుకు సంబంధించిన భారీ నిల్వలు ఉండటం వల్ల అభివృద్ధి చెందిన దేశాలు సరఫరా అంతరాయాల సమయంలో అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో అధిక ధరలు చెల్లించకుండా దీర్ఘకాలిక ఒప్పందాలతో తమ అవసరాలను భద్రపరుచుకోగలుగుతున్నాయి. చైనా అయితే అమెరికా ఆంక్షలను కూడా పక్కన పెట్టి.. రష్యా నుంచి పెద్దమొత్తంలో చమురు కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అయితే.. ప్రస్తుత ప్రపంచ పరిణామాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో భారత్‌లో చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదాలు లేకపోలేదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -వెబ్‌డెస్క్


