
భువనేశ్వర్: అవినీతికి పాల్పడుతున్న అటవీశాఖ అధికారుల్ని విజిలెన్స్ అధికారులు ఆట కట్టిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు అటవీ శాఖ అధికారుల ఇళ్లలో విజిలెన్స్ శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఓ అధికారికి 116 ఫ్లాట్లు గుర్తించగా.. మరో అధికారి ఇంట్లో తవ్వే కొద్దీ నోట్ల కట్టలు, గోల్డ్ కాయిన్లు, ఇతర బంగారు ఆభరణాలు వెలుగులోకి వచ్చాయి. సదరు అధికారుల ఇళ్లల్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆరో ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో అటవీశాఖ డిప్యూటీ రేంజర్ రామ చంద్ర నాయక్ నివాసంలో ఆదాయానికి మించిన రూ.1.44 కోట్ల క్యాష్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఆస్మిక తనిఖీలు చేపట్టారు అధికారులు.
తనిఖీల్లో జయపూర్‌లోని ఆయన ఫ్లాట్‌లో రహస్య గదిలో దాచిన రూ. 1.44 కోట్ల నగదు, 4 బంగారు బిస్కెట్లు, 16 బంగారు నాణేలు (ప్రతి నాణెం 10 గ్రాములు),6 ప్రాంతాల్లోని జయపూర్, భువనేశ్వర్‌లోని ఆయన నివాసాలు, బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. కాగా, ఈ దాడుల్లో ఆరుగురు డీఎస్పీలు, ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు, తొమ్మిదిమంది ఏఎస్‌ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కరెన్సీ కౌంటింగ్ మెషీన్లు ఉపయోగించి నగదు లెక్కింపు కొనసాగుతోంది.
ఈ దాడికి ముందు మరో అటవీ శాఖ అధికారి నివాసాల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సదరు అధికారికి 119కి పైగా ప్లాట్లు ఉన్నట్లు తేలింది.