
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలోగల త్రికూట కొండలలో కొలువైన మాతా వైష్ణో దేవి పవిత్ర గుహ ఆలయం శారదా నవరాత్రులకు ముస్తాబయ్యింది. సోమవారం(సెప్టెబర్ 22) నుండి ప్రారంభమయ్యే తొమ్మిది రోజుల ఉత్సవాలకు ఆలయంలో సకల ఏర్పాట్లు చేశారు.
నవరాత్రులలో వైష్ణోదేవిని సందర్శించేందుకు అత్యధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న దృష్ట్యా యాత్రికులకు సౌకర్యాలు కల్పించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు అధికారి ఒకరు తెలిపారు. 5,200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయాన్ని అత్యంత పవిత్రమైన హిందూ ఆలయాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ తొమ్మిది రోజులలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి , విదేశాల నుండి కూడా యాత్రికులు వైష్ణోదేవి గుహ మందిరాన్ని సందర్శించేందుకు తరలివస్తారు. నవరాత్రుల ప్రత్యేక ఏర్పాట్ల గురించి ఆలయ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘మాతా వైష్ణో దేవి గర్భగుడి, దాని చుట్టుపక్కల ప్రాంతాలను అద్భుతమైన పూలతో అలంకరిస్తున్నారని, ఆలయ ప్రాంతాన్ని ఆకర్షణీయమైన, రంగురంగుల లైట్లతో తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.
ఉదయం, సాయంత్రం హారతి సమయంలో ప్రముఖ గాయకులను ఆహ్వానించినట్లు తెలిపారు. మరోవైపు బోర్డు సీఈఓ సచిన్ కుమార్.. వైశ్య భవన్, బాన్ గంగా, తారకోట్ మర్గ్ లలో జరుగుతున్న ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తున్నారు. ఆలయానికి వెళ్లే దారుల వెంబడి 24 గంటలూ నీరు, విద్యుత్ సరఫరా, శానిటైజేషన్, మెడికేర్, ఆహారం అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. కాగా ఆగస్టు 26న కొండచరియలు విరిగిపడి, 34 మంది యాత్రికులు మరణించిన దృష్ట్యా, ఈ ఏడాది ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం లేదు. దుర్ఘటన దరిమిలా ఎల్‌జీ మనోజ్ సిన్హా ఆగస్టు 29న అదనపు ప్రధాన కార్యదర్శి షలీన్ కబ్రా, ఐజీపీ భీమ్ సేన్ టుటి, జమ్ము డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్‌లతో కూడిన ప్యానెల్‌తో దర్యాప్తునకు ఆదేశించారు.