ముంబై: లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణలతో ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ నాసిక్ క్యాంపస్ వ్యవహారం సంచలనంగా మారింది. తాజాగా ఈ ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. 2021 నుంచి టీసీఎస్‌లో దారుణాలు జరుగుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
మహిళా ఉద్యోగులను మత మార్పిడి చేసుకునేలా ప్రోత్సహించిన ఆరుగురు ఉద్యోగులు అరెస్టయ్యారు. పరారీలో ఉన్న హెచ్‌ఆర్ మేనేజర్ కూడా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెలుగులోకి వచ్చాయి.
ఆమె సహచర ఉద్యోగులకు హిందూ మహిళా ఉద్యోగులను పెళ్లి చేసుకోవాలని ప్రోత్సహించేవారని సమాచారం. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించడం, మత మార్పిడిని ప్రోత్సహించడం, వారి బ్రెయిన్‌వాష్ చేసి మతం మార్చుకునేలా ఒత్తిడి చేయడం, అందుకు కావాల్సిన నిధులను సమకూర్చడం వంటి చర్యలు జరిగినట్లు తేలింది. హెచ్‌ఆర్ విభాగానికి చెందిన కొంతమంది ఉద్యోగులు కూడా ఈ వ్యవహారంలో భాగమయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
హెచ్‌ఆర్ మేనేజర్ మా సహచరులతో నిత్యం మాట్లాడేవారు. వారి మాటల్లో మతం ప్రస్తావన ఉండేది. హిందూ మహిళా ఉద్యోగులను ప్రేమలోకి దించమని, వారిని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చేవారు. 2021 నుంచి ఇదే విధంగా జరుగుతోంది. మత మార్పిడిని ప్రోత్సహిస్తూ ఫండ్స్ సమకూర్చేవారు' అని సాక్షులు వివరించారు.
ఓ నిందితుడు పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఓ ఉద్యోగినిని శారీరకంగా లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు తప్పించుకుని తిరిగేవాడు. ప్రశ్నిస్తే బాధిత ఉద్యోగినిని బాడీషేమింగ్ చేస్తూ అసభ్యంగా మాట్లాడేవాడు. సంస్థలో ఇలా జరుగుతోందని హెచ్‌ఆర్ విభాగంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పైగా వారి చర్యలకు పరోక్షంగా సహకరించారు.
నిందితులు పురుష ఉద్యోగులలో ఒకరిని నమాజ్ చేయమని బలవంతం చేసి, అతని మతాన్ని అవమానించాడు. బాధిత మహిళా ఉద్యోగులు కంపెనీ మహిళా హెచ్‌ఆర్ మేనేజర్‌కు ఫిర్యాదు చేస్తే..‘ఫిర్యాదు చేస్తే ఉద్యోగం నుండి తొలగిస్తాం’ అని బెదిరించేవారు
‘లేడీ కెప్టెన్’గా పేరున్న హెచ్‌ఆర్ మేనేజర్ నిదా ఖాన్ మహిళా ఉద్యోగులతో స్నేహం పెంచి, వారిని సౌకర్యంగా ఉంచి, క్రమంగా నమాజ్ చేయడం, హిజాబ్ ధరించడం వంటి ఆచారాలకు శిక్షణ ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. టీసీఎస్ నాసిక్ క్యాంపస్ ఘటన యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై చర్యలు తీసుకుంది.


