ఇంటింటికీ ఆధార్‌ సేవలు!

UIDAI training 48000 postmen to provide Aadhaar sewa at people doorstep - Sakshi

48వేల మంది పోస్ట్‌మెన్‌కు శిక్షణ

న్యూఢిల్లీ: మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా ఆధార్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పోస్టమెన్‌ను వినియోగించుకోవాలని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మొదటి దశలో ఇండియాపోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌కు చెందిన 48 వేల మంది పోస్ట్‌మెన్‌ను రంగంలోకి దించనుంది. వీరు మారుమూల ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి చిన్నారుల పేర్లు నమోదు చేసుకోవడం, ఆధార్‌తో సెల్‌ఫోన్‌ నంబర్లను లింక్‌ చేయడం, వివరాలను అప్‌డేట్‌ చేయడం వంటి సేవలు అందించనున్నారు. రెండో దశ ప్రణాళికలో భాగంగా 1.50లక్షల మంది తపాలా శాఖ అధికారులను కూడా ఇందులో భాగస్వాములను చేయనుందని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల వారితోపాటు, సాధ్యమైనంత ఎక్కువ మంది పౌరులకు ఆధార్‌ను అందజేయడమే యూఐడీఏఐ లక్ష్యమన్నారు. ఇంటింటికీ వెళ్లే పోస్ట్‌మెన్‌ ఆధార్‌ వివరాలను అక్కడికక్కడే అప్‌డేట్‌ చేసేందుకు వీలుగా ట్యాబ్లెట్‌ పీసీ/ల్యాప్‌టాప్‌లను అందజేస్తామని తెలిపారు. వీరితోపాటు దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే 13వేల మంది కామన్‌ సర్వీస్‌ సెంటర్ల బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను ఇందులో భాగంగా చేస్తామన్నారు. ఇంకా దేశవ్యాప్తంగా 755 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఆధార్‌ సేవా కేంద్రాలను కొత్తగా ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రతి రోజూ ఆన్‌లైన్‌ ద్వారా కనీసం 50వేల మంది చిరునామా, ఫోన్‌ నంబర్, ఇతర వివరాలను అప్‌డేట్‌ చేసుకుంటున్నట్లు చెప్పారు. దేశంలోని ప్రతి పౌరుడికీ 12 అంకెల బయోమెట్రిక్‌ గుర్తింపు సంఖ్య ఆధార్‌ను అందించేందుకు యూఐడీఏఐ నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తోంది.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top