తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని శాసనసభ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 15 రోజుల్లోనే రాష్ట్రంలో భారీ సంఖ్యలో నేరాలు జరిగాయని ఆరోపిస్తూ, మహిళలు, పిల్లల రక్షణ కోసం సీఎం విజయ్ తీసుకుంటున్న చర్యలేంటో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉదయనిధి స్టాలిన్ సోమవారం తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నారు.
తమిళనాడులో గత 15 రోజుల్లోనే 25 హత్యలు, 4 జంట హత్యలు , 19 లైంగిక దాడులు జరిగాయని వివరించారు. ఇవి కేవలం మీడియాలో వచ్చిన వార్తల ఆధా రంగా తెలిసిన గణాంకాలు మాత్రమేనని పేర్కొన్నారు. మార్పు.. మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన వారి పాలనలో.. తమిళనాడు శాంతిభద్రతలు ఏస్థాయిలో దిగజారిపోయాయో చెప్పడానికి ఈ ఘోరాలే నిదర్శనం అని వివరించారు. అసలు ఇది తమిళనాడా లేక ఉత్తర ప్రదేశా?‘ అని ఆయన ప్రశ్నించారు.
వరుస నేరాల తో విమర్శల దాడి
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పలు దారుణ ఘటనలను ఉదయనిధి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కోయంబత్తూర్ సూలూర్ పరిధిలో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన నుంచి కోలుకోకముందే, విల్లుపురం జిల్లాలో మరో బాలికపై లైంగిక దాడి జరిగిందన్నారు. ప్రసిద్ధ మధురై మీనాక్షి అమ్మన్ ఆలయం సమీపంలోనే ఒక బాలుడు దారుణంగా హత్యకు గురయ్యాడని, కోయంబత్తూర్‌లో ఒక యువతి ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరి భయాందోళనలు సృష్టించారని వివరించారు.
సీఎం నియోజకవర్గంలోనే అరాచకం
స్వయంగా సీఎం సొంత నియోజకవర్గమైన పెరంబూర్‌లో మత్తు ముఠా ఏకంగా 13 వాహనాల అద్దాలను ధ్వంసం చేస్తూ అరాచకానికి ఒడిగట్టిందన్నారు. ఎన్నికల ముందు వీర నినాదాలు చేసిన సీఎం, ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఎందుకు నోరు విప్పడం లేదు? మీ ’సింగపెన్’ (మహిళా రక్షణ) టాస్క్ ఫోర్స్ ఏమైంది? అని ఉదయనిధి నిలదీశారు. పెరుగుతున్న నేరాలతో ప్రజలు తీవ్ర భయాందోళనల్లో ఉన్న తరుణంలో.. కేవలం కంటితుడుపు చర్యగా ఉదయం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, ఒక ప్రకటన విడుదల చేస్తే సరిపోదని సీఎంను ఉద్దేశించి ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని, మహిళలు, చిన్నారు లకు రక్షణ కలి్పంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో సీఎం సమాధానం చెప్పాలన్నారు.


