గీజర్‌ మృత్యువాయువు | Two sisters died due to LPG leakage | Sakshi
Sakshi News home page

గీజర్‌ మృత్యువాయువు

Oct 26 2025 12:04 PM | Updated on Oct 26 2025 12:04 PM

Two sisters died due to LPG leakage

అక్కాచెల్లి బలి  

మైసూరు జిల్లాలో దుర్ఘటన  

మైసూరు: వేడినీళ్ల కోసం అమర్చుకున్న గ్యాస్‌ గీజర్‌ మృత్యుపాశాలుగా మారుతున్నాయి. తరచూ ఎక్కడో ఓ చోట ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గీజర్‌ నుంచి గ్యాస్‌ లీకై అక్కాచెల్లెళిద్దరూ ఊపిరాడక మరణించిన దారుణ ఘటన జిల్లాలోని పిరియాపట్టణ తాలూకాలో జరిగింది. మృతులను పిరియాపట్టణలోని బెట్టదపుర నివాసులైన అల్తాఫ్‌ పాషా రెండో కుమార్తె గుల్బమ్‌ తాజ్‌ (23), నాలుగో కుమార్తె సిమ్రాన్‌ (21)గా గుర్తించారు. వివరాలు.. పిరియాపట్టణలోని జోనిగేరి వీధిలో అల్తాఫ్‌ పాషా కుటుంబం కొత్తగా బాడుగ ఇంటిలోకి చేరి ప్రార్థనలు చేసి పిండివంటలు చేసుకున్నారు.  

ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పటికి..  
రాత్రి సుమారు 7 గంటల సమయంలో అక్కాచెల్లెళ్లిద్దరూ స్నానానికి వెళ్లారు. ఈ సమయంలో స్నానాల గదిలోని గ్యాస్‌ గీజర్‌ను ఆన్‌ చేయగానే దాని నుంచి విషపూరిత గ్యాస్‌ లీకైంది. కొంతసేపటికి ఊపిరాడక ఇద్దరూ స్పృహ తప్పి పడిపోయారు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో గది తలుపులు తెరిచి చూడగా  కుప్పకూలిపోయి ఉన్నారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.   

ఇటీవల నిశ్చితార్థం  
కాగా అల్తాఫ్‌ పాషాకు నలుగురు కుమార్తెలు సంతానం ఉండగా, వారిలో ఇద్దరికి  వివాహాలయ్యాయి. గుల్బమ్‌ తాజ్‌కు ఇటీవల నిశి్చతార్థమైంది. ఘటన సమయంలో కాబోయే భర్త కుటుంబం వారి ఇంటిలోనే ఉంది. ఈ ఘోరంతో కుటుంబీకులు తీవ్రంగా విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement