అస్సాంలో మూడు ముక్కలాట! | Three-way battle in Assam Assembly elections | Sakshi
Sakshi News home page

అస్సాంలో మూడు ముక్కలాట!

Apr 4 2026 5:45 AM | Updated on Apr 4 2026 9:54 AM

Three-way battle in Assam Assembly elections

ప్రాంతీయ అస్తిత్వ పోరాటంగా ఎన్నికలు

ఎగువ, మధ్య, దిగువ అస్సాంగా విభజన

డీలిమిటేషన్‌తో మారిపోయిన సమీకరణాలు

సాక్షి, న్యూఢిల్లీ: అస్సాం ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ‘ప్రాంతీయ’పోరుగా మారాయి! ఎగువ, మధ్య, దిగువ అస్సాం ప్రాంతాల మధ్య సంక్లిష్టమైన రాజకీయ యుద్ధంగా రూపుదాల్చాయి. ప్రతి ప్రాంతానికీ భిన్నమైన సామాజిక నేపథ్యం, స్థానిక సమస్యలు, ఓటింగ్‌ సరళి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాల్లో ఎగువ అస్సాంలో 35, బోడోలాండ్‌తో కలిపి మధ్య అస్సాంలో 41, దిగువ అస్సాంలో 50 సీట్లు ఉన్నాయి. 

2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎగువ అస్సాం బీజేపీ వశం కాగా దిగువ అస్సాంలో ఆ పార్టీకి, కాంగ్రెస్‌కు హోరాహోరీ పోరు సాగింది. మధ్య అస్సాం రెండింటినీ ఆదరించింది. 2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) ప్రక్రియ, సరిహద్దు జిల్లాల్లో ఊపందుకున్న అస్తిత్వ రాజకీయాలు, భారీగా కొత్త ఓటర్ల చేరికతో ఈసారి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. 

దిగువ అస్సాం: సరిహద్దులో నువ్వా నేనా! 
బంగ్లాదేశ్‌ సరిహద్దును ఆనుకుని ఉండే దిగువ అస్సాం ప్రాంతంలో గుర్తింపు, అస్తిత్వ రాజకీయాలదే ప్రధాన పాత్ర. 50 అసెంబ్లీ స్థానాలున్న ఈ ప్రాంతంలో దుబ్రీ, బార్పేట, గోల్పారా వంటి ముస్లిం ప్రాబల్య జిల్లాలున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఇరు కూటములు హోరాహోరీగా తలపడ్డాయి. ఎన్డీఏకు 23 సీట్లు రాగా కాంగ్రెస్‌ కూటమి 27 స్థానాలతో పైచేయి సాధించింది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్, దాని భాగస్వామి ఏఐయూడీఎఫ్‌కు బలమైన పట్టుంది. అస్సాంలో ఏఐయూడీఎఫ్‌ గెలిచిన 16 సీట్లలో అత్యధికం ఇక్కడే కావడం విశేషం! ఈసారి మాత్రం దిగువ అస్సాంలో కాంగ్రెస్‌ కూటమికి బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. 

ఎగువ అస్సాం: బీజేపీ కంచుకోట 
అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్‌ ఆశలకు ఎగువ ప్రాంతమే అత్యంత కీలకం! తిన్‌సుకియా, శివసాగర్, డిబ్రూగఢ్, జోర్హాట్‌ వంటి కీలక జిల్లాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక్కడి 35 అసెంబ్లీ స్థానాల్లో 2021 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏకంగా 30 సీట్లు కైవసం చేసుకుని సత్తా చాటింది. కాంగ్రెస్‌ కూటమి 5 స్థానాలకు పరిమితమైంది. డీలిమిటేషన్‌ తర్వాత ఈ ప్రాంతంలో గిరిజన జనాభా శాతం పెరగడం బీజేపీకి మరింత కలిసొచ్చే అంశం. 

మధ్య అస్సాం: అధికారానికి వారధి! 
నగావ్, మోరిగావ్‌తో పాటు బోడోలాండ్‌ ప్రాంతంతో కూడిన మధ్య అస్సాం ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారింది. ఇక్కడ 41 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతంలో కుల, ప్రాంతీయ రాజకీయాల ప్రభావం మరీ ఎక్కువ. పలు స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు కింగ్‌మేకర్లు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి 22, కాంగ్రెస్‌ కూటమి 16, యూపీపీఎల్, బీపీఎఫ్‌ వంటి ప్రాంతీయ పార్టీలు 3 స్థానాలు నెగ్గాయి. డీలిమిటేషన్‌ ప్రక్రియతో ఈ ప్రాంతం రాజకీయంగా సరికొత్త రూపు సంతరించుకుంది. చాలా అసెంబ్లీ స్థానాల సరిహద్దులు మారిపోయాయి. ఎస్టీ రిజర్వుడ్‌ స్థానాల సంఖ్య పెరిగింది. ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు ముక్కలయ్యాయి.

ఈసారి కీలకాంశాలివే...
→ అస్సాంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బాగా ప్రభావం చూపనుంది. 
→ కొత్త ఓటర్లతో పాటు భారీగా ఓట్ల గల్లంతు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 
→ బోడోలాండ్‌లో ప్రాంతీయ పార్టీల వైఖరి, ఎగువ అస్సాంలో బీజేపీ ఎదుర్కొంటున్న అగ్నిపరీక్ష, దిగువ అస్సాంలో అస్తిత్వ పోరాటం ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి.  

స్వల్ప ఓట్లతోనే భారీ తేడా 
2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 75 స్థానాలు గెలిస్తే విపక్ష కాంగ్రెస్‌ కూటమి 50కి పరిమితమైంది. స్థానాలపరంగా ఇంత తేడా ఉన్నా ఓటుబ్యాంకు విషయంలో మాత్రం పెద్దగా అంతరం లేకపోవడం విశేషం! బీజేపీకి 33 శాతం, కాంగ్రెస్‌కు 30 శాతం ఓట్లు పడ్డాయి. ఇతరులు ఒక స్థానానికి (0.8 శాతం) పరిమితం కాగా, ఏఐయూడీఎఫ్‌ పార్టీ 9 శాతం ఓటు బ్యాంకును సాధించింది. అంటే.. గెలిచిన సీట్లలో ఎన్డీయే స్పష్టమైన మెజారిటీ చూపించినా, ఓట్ల శాతంలో మాత్రం కాంగ్రెస్‌ కూటమి గట్టి పోటీనే ఇచ్చింది.  

Advertisement
 
Advertisement
Advertisement