15 నెలల్లో ఎన్సీపీ నుంచి ముగ్గురి పదవులు హుష్‌కాకి | Third NCP exit in 15 months | Sakshi
Sakshi News home page

15 నెలల్లో ఎన్సీపీ నుంచి ముగ్గురి పదవులు హుష్‌కాకి

Mar 21 2026 8:47 PM | Updated on Mar 21 2026 8:51 PM

 Third NCP exit in 15 months

ముంబై: రిటైర్డ్‌ మర్చంట్‌ నేవీ ఆఫీసర్‌, స్వయం ప్రకటిత జ్యోతిష్కుడు అశోక్‌ ఖారత్‌ వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాల్లోనూ కలకలం రేపుతోంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న అశోక్‌ ఖారత్‌తో మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్, అధికార ఎన్సీపీ నాయకురాలు రూపాలి చకాంకర్ కలిసి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బయటకు రావడంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. దీంతో మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి ఆమె రాజీనామా చేశారు. 

మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ఎన్సీపీ నుంచి ఇప్పటికే ఇద్దరు నాయకులు పదవులు కోల్పోయారు. ఇప్పుడు రూపాలి చకాంకర్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ కూటమిలో ఎన్సీపీ నుంచి పదవి కోల్పోయిన మూడో నేత రూపాలి. ఆమె కంటే ముందు ధనంజయ్ ముండే, మాణిక్‌రావ్‌ కొకాటే మంత్రి పదవులకు రాజీనామా చేశారు.

ఎన్సీపీలో నాయకత్వ బలహీనత 
మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణం తర్వాత చోటుచేసుకున్న ఈ ఘటన ఎన్సీపీ నాయకత్వ బలహీనతను కూడా బయటపెట్టింది. మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత పార్టీ అధినేత సునేత్ర పవార్.. రూపాలి చకాంకర్‌ తీరును బహిరంగంగా ఖండించలేదు. త్వరగా చర్యలు తీసుకోలేదు.  

మరోవైపు, 2025 మార్చిలో మంత్రి ధనంజయ్ ముండే సహాయకుడు వాల్మిక్ కారడ్ బీడ్.. జిల్లా మసాజోగ్ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసుతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. తర్వాత ముండే రాజీనామా చేయాలని డిమాండ్లు వచ్చాయి. 

2025 డిసెంబర్‌లో మరో ఎన్సీపీ మంత్రి మాణిక్‌రావ్‌ కొకాటే నాసిక్ కోర్టు శిక్ష విధించిన ఒక రోజు తర్వాత రాజీనామా చేశారు. ప్రభుత్వ ఫ్లాట్ పొందేందుకు పత్రాల్లో మార్పులు చేసిన కేసులో ఆయనకు రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది. సిన్నర్ ఎమ్మెల్యేగా ఉన్న కొకాటే 1995 కేసులో ముఖ్యమంత్రి ప్రత్యేక కోటా కింద అక్రమంగా పొందిన వ్యవహారానికి సంబంధించిన కేసులో దోషిగా తేలారు. 2025 ఆగస్టులో ఆయన ఫోన్‌లో కార్డులు ఆడుతున్న ఫొటో బయటపడటంతో వ్యవసాయ శాఖ నుంచి ఆయనను తొలగించారు. తర్వాత క్రీడలు, మైనారిటీ వ్యవహారాల మంత్రిగా మళ్లీ నియమించారు. వ్యవసాయ శాఖను తర్వాత దత్తాత్రయ భార్నేకు అప్పగించారు.

సునేత్రకు పార్టీపై పట్టు ఉందా? 
చకాంకర్ ఘటన నాయకత్వ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తింది. సునేత్ర పవార్ ఇప్పటివరకు చకాంకర్ రాజీనామా స్వీకరించానని మాత్రమే తెలిపారు. లైంగిక దాడి ఆరోపణల కేసులో తన అధికారాన్ని చూపే అవకాశం ఇది అని పార్టీ వర్గాలు భావించాయి. కానీ ఆ అవకాశాన్ని ఆమె కోల్పోయారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, చకాంకర్ ఇప్పటికీ ఎన్సీపీ రాష్ట్ర మహిళ విభాగ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు, అంతర్గత క్రమశిక్షణ చర్యలు ఇంకా లేవు. అజిత్ పవార్ మరణం తర్వాత సునేత్ర పవార్ పార్టీ బాధ్యతలు తీసుకున్నప్పటికీ, అంతర్గత వ్యవహారాలపై పూర్తి నియంత్రణ ఇంకా చూపలేకపోతున్నట్టు కనిపిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement