
కార్పొరేట్ ప్రపంచం చాలా చిత్రమైంది. ఒక పైసా ఖర్చు మిగిల్చేందుకు వంద రూపాయలు తగలేసేందుకూ సిద్ధం. ఇది కూడా అట్లాంటి వ్యవహారమే. కంపెనీ ఊరూ, పేరు తెలియదు కానీ.. సామాజిక మాధ్యమం రెడిట్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం...
అతడో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఏళ్లుగా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. గాడిద చాకిరీ చేస్తున్నానని తనే చెప్పుకున్నాడు కూడా. ఈమధ్యే వార్షిక ఇంక్రిమెంట్ల ప్రహసనం ముగిసింది. ఊహించినట్టుగానే జీతం జానెడే పెరిగింది. ‘‘జీతం కనీసం పది శాతమైనా పెంచండి సారూ’’ అంటూ పైవాళ్లకు మెయిల్ పెట్టాడు. పైనున్న మేనేజర్.. ఆ పైనున్న హెచ్‌ఆర్ వాళ్లు ఏమనుకున్నారో.. ఎలా ఆలోచించారో తెలియదు కానీ.. ‘‘ఠాట్.. పది శాతం పెంచమంటావా’’ అంటూ హూంకరించారు.
‘‘నిన్ను ఉద్యోగం లోంచి పీకేశాం. ఫో’’ అనేశారు. కంపెనీ కదా.. ఆమాత్రం పైచేయి చూపడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆఫ్ట్రాల్ ఒక ఉద్యోగి విజ్ఞప్తిని మన్నిస్తే.. అందరూ మీదపడిపోతారు అనుకుని ఉంటుంది. తొలగించనైతే తొలగించారు కానీ.. అప్పటివరకూ ఆ ఇంజినీర్ చేసే పని? అర్జెంటుగా ‘‘సిబ్బంది కావలెను’’ అన్న సందేశం వెళ్లిపోయింది. హడావుడిగా మెయిళ్లు అటు ఇటూ కదిలాయి. బోలెడంత మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. చివరకు ఆరు మందిని సెలెక్ట్ చేశారు. మంచి ప్యాకేజీలతో వారి జీతాలూ ఫిక్స్ చేసేశారు. ఆ ఒక్కడు చేసే పనిని వీరందరూ కలసికట్టుగా చేయడం మొదలుపెట్టారు కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల వ్యవహారం ఇలా ఉంటుందన్నమాట.
పది శాతం పెంపును నిరాకరించి ఉద్యోగంలోంచి తొలగించిన ఆ ఉద్యోగి ఆరేళ్లపాటు కంపెనీకి సంబంధించిన కీలకమైన బ్యాకెండ్ వ్యవస్థను ఒంటిచేత్తో నడిపిస్తున్నాడట. ముందుగా చెప్పినట్లు గాడిద మాదిరిగా ఆ బాధ్యతంతా తలపై మోసుకుని కష్టపడినా.. సహోద్యోగుల కంటే తక్కువ జీతం వస్తూండటంతో ఉండబట్టలేక జీతం పది శాతం పెంచమని అడిగాడట. ఇక లాభం లేదనుకుని కంపెనీ పనులపై శ్రద్ధ తగ్గించేశాడు. ఇతగాడి ఖర్మానికో, పుణ్యానికో అప్పుడే కంపెనీలో ఒక కొత్త డైరెక్టర్ వచ్చి చేరాడు. ఆఫీసుకు సక్రమంగా రావడం లేదన్న మిషతో ఉద్యోగంలోంచి తీసేశాడు. ఫలితం.. ఒకరి స్థానంలో ఆరుగురికి జీతాలు సమర్పించుకోవాల్సి రావడం. ‘‘పదిశాతం పెంచేసి ఉంటే గొడవే ఉండకపోవను. అయితే ఒక్కటి. ప్రపంచంలో న్యాయం అనేది ఇంకా ఉంది అనేందుకు ఇదో నిదర్శనం’’ అని ఆ ఉద్యోగి తన రెడిట్ పోస్టులో రాసుకోవడం అక్షర సత్యం అనిపిస్తుంది! ఏమంటారు?