
టేకు అనగానే.. అందమైన ఫర్నీచర్‌లో ఇమిడిన విలువైన కలప గుర్తొస్తుంది. టేకు చెట్టులో కలప తప్ప ఆకులు ఎందుకూ పనికిరావని ఇన్నాళ్లూ అనుకునేవాళ్లు. కానీ ఈ పత్రాలకు కూడా గొప్ప ప్రయోజనం ఉందని తాజా పరిశోధనలో వెల్లడైంది. తీవ్రమైన లేజర్ కిరణాల రేడియేషన్‌ను అడ్డుకునే శక్తి టేకు ఈ ఆకుల్లో ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. వైద్యం, వినోద రంగం, పరిశ్రమలు, రక్షణ రంగం, శాస్త్రీయ పరిశోధన.. ఇలా ఆధునిక యుగంలో ప్రధాన రంగాల్లోనూ.. ఇంటర్నెట్‌కు వెన్నెముక లాంటి ఫైబర్ ఆప్టిక్స్‌లోనూ.. టేకు ఆకుల్లోని ప్రత్యేక శక్తిని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్
అత్యంత ప్రభావశీలమైన లేజర్ కిరణాల రేడియేషన్ నుంచి చర్మాన్నీ, కంటినీ, సున్నితమైన ఆప్టికల్ పరికరాలను సైతం రక్షించే శక్తి టేకు ఆకులకు ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. వైద్యం, వినోద రంగం, పరిశ్రమలు, రక్షణ రంగం, శాస్త్రీయ పరిశోధన.. ఇలా ఆధునిక యుగంలో ప్రధాన రంగాల్లో లేజర్ రేడియేషన్‌దే ప్రధానపాత్ర. ఇంటర్నెట్‌కు వెన్నెముక లాంటి ఫైబర్ ఆప్టిక్స్‌లోనూ లేజర్ కిరణాలే కీలకం.
అయితే, వీటిని ఉపయోగించే సమయంలో పొరపాటున ఆ కిరణాలు మనుషుల కళ్లకు, శరీరానికి హాని జరగనీయకుండా అడ్డుపడే కవచాన్ని రూపొందించేందుకు టేకు ఆకు అద్భుతంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ నిధులతో పరిశోధనలు చేసే స్వయంప్రతిపత్తి గల సంస్థ ‘రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌ఆర్‌ఐ)’ శాస్త్రవేత్తల పరిశోధనలో టేకు ఆకు ప్రయోజకత్వం వెల్లడైంది. ఆర్‌ఆర్‌ఐను ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సర్ సి.వి.రామన్ స్థాపించారు.
ప్రత్యేక లక్షణాలు
టేకు ఆకులను ఎండబెట్టి, పొడి చేసి, ఆ పొడిని ప్రత్యేక రసాయనాల్లో నానబెట్టి, శుద్ధి చేసిన తర్వాత గోధుమ–ఎరుపు రంగు ద్రవాన్ని వెలికితీశారు. ఈ వర్ణద్రవ్యానికి లేజర్ కాంతి లక్షణాలు మార్చి, తీవ్రతను తగ్గించే నాన్‌లీనియర్ ఆప్టికల్ (ఎన్‌ఎల్‌ఓ) గుణాలు ఉన్నట్టు ఆర్‌ఆర్‌ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. అధిక తీవ్రతల వద్ద కాంతి ప్రసారాన్ని తగ్గించడానికి.. మన శరీరం, కళ్ళను కాపాడటానికి నాన్ లీనియర్ వస్తువుల్లో ఉండే ఆప్టికల్ పవర్ లిమిటింగ్ ఉపయోగపడుతుంది. ఇవే లక్షణాలు టేకు ఆకుల్లోనూ ఉన్నట్టు పరిశోధనలో వెల్లడైంది.
‘సింథటిక్’ పదార్థాలకు బదులుగా..
ఇప్పటివరకు వాడుతున్న గ్రాఫీన్, ఫుల్లెరెన్స్, మెటల్ నానోపార్టికల్స్ వంటి ప్రకృతికి హాని కలిగించే ఖరీదైన సింథటిక్ ఆప్టికల్ పదార్థాలకు బదులు టేకు ఆకుల్లోని రంగులను వాడుకోవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సహజమైన, కుళ్లి ప్రకృతిలో కలిసిపోయే పర్యావరణ ప్రియమైన, విరివిగా లభించే టేకు ఆకులను ఉపయోగించటం ద్వారా లేజర్ రక్షక కళ్లజోళ్లు, ఇతర ఆప్టికల్ పరికరాలు తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
లేజర్ రేడియేషన్ ఉపయోగాలు
లేజర్ రేడియోషన్ లేదా లేజర్ కాంతి ఎంత ప్రయోజనకరమైనదో అంతే ప్రమాదకరమైనది. దీన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకమైన కళ్లజోళ్లు ధరించాలి. లేజర్ కాంతి కంటిని నేరుగా తాకితే దృష్టి కోల్పోయే ప్రమాదం ఉంది. అధిక శక్తి గల లేజర్‌లు చర్మాన్ని కూడా కాల్చేయగలవు. దీన్ని అనేక రంగాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు.
» వైద్యరంగంలో కన్ను, చర్మ సంబంధ శస్త్ర చికిత్సలు; డయాగ్నొస్టిక్స్‌లో...
» పరిశ్రమల్లో కటింగ్, వెల్డింగ్, లేజర్ మార్కింగ్, లేజర్ స్కాన్‌లలో..
» శాస్త్రీయ పరిశోధనలో కాంతి లక్షణాలను అధ్యయనం చేయడానికి..
» సీడీ ప్లేయర్‌లు, లేజర్ పాయింటర్‌లు, బార్‌కోడ్ స్కానర్ వంటి వినియోగదారుల ఉత్పత్తుల్లో..
» రక్షణ రంగంలో కమ్యూనికేషన్, శత్రువుల క్షిపణులను కూల్చడం వంటి వాటికి..
» వినోద రంగంలో లేజర్ లైట్ షోలు, స్పెషల్ ఎఫెక్టుల కోసం..