తమిళనాడులో ఘోర ప్రమాదం | Tamil Nadu Virudhnagar Fire Accident News Updates | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఘోర ప్రమాదం

Apr 13 2026 10:44 AM | Updated on Apr 13 2026 4:07 PM

Tamil Nadu Virudhnagar Fire Accident News Updates

తమిళనాడు విరుధ్‌నగర్‌ జిల్లాలో భారీ ప్రమాదం సంభవించింది. సత్తూర్‌ దగ్గర ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. క్షతగాత్రులకు శివకాశి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందుతోంది. కొందరు కార్మికులు లోపలే చిక్కుకుని ఉన్నారని యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

కన్నన్‌ అనే వ్యక్తికి చెందిన ఎక్సెల్‌ బాణాసంచా ఫ్యాక్టరీలో ఈ ఉదయం వరుసగా నాలుగుసార్లు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ శబ్దం సుమారు 6 కిలోమీటర్ల దూరం వినిపించింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వణికిపోయారు. భారీగా మంటలు ఎగసిపడడంతో.. ఐదు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 

కొందరు కార్మికులు పేలుడుతో దూరంగా ఎగిరిపడగా.. సహాయక బృందాలు ఆస్పత్రికి తరలించాయి. ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఫ్యాక్టరీ, గోదాంలకు చెందిన 10 గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో 60 మంది కార్మికులు లోపల ఉన్నారని యాజమాన్యం చెబుతోంది. దీనిని బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. టపాసులు తయారు చేస్తుండగానే పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ఘటనపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మంత్రి నాగేంద్రన్‌ శివకాశి ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ లైసెన్స్‌ రెన్యువల్‌ కాలేదని సమాచారం. సహాయక చర్యలు పూర్తయ్యాకే నష్టం వివరాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement