
న్యూఢిల్లీ: ఆస్తి వివాదం కేసులో దత్తత డీడ్ చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తండ్రి ఆస్తిలో ఇద్దరు కూతుళ్ల న్యాయబద్ధ వారసత్వ హక్కును నిరాకరించేందుకే పథకం ప్రకారమే ఈ డీడ్‌ను చూపుతున్నారంటూ వ్యాఖ్యానించింది.
వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన భువనేశ్వర్ సింగ్‌కు ఇద్దరు కూతుళ్లు శివ కుమారీ దేవి, హర్మునియా. 1967లో భువనేశ్వర్ సింగ్ అశోక్ కుమార్ అనే బాలుణ్ని దత్తత తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పత్రం, ఫొటో కూడా ఉన్నాయి. అయితే, చట్ట ప్రకారం దత్తతకు సమ్మతి తెలుపుతూ దంపతుల సంతకాలు దత్తత పత్రంపై తప్పనిసరి. అయితే, దత్తత స్వీకార పత్రంపై కేవలం భువనేశ్వర్ సింగ్ సంతకం మాత్రమే ఉండటం, దత్తత స్వీకారం కార్యక్రమంలో ఆయన మాత్రమే కనిపించడం వంటి అంశాలను ఎత్తి చూపిన అలహాబాద్ హైకోర్టు ఈ మొత్తం వ్యవహారం చెల్లదని స్పష్టం చేసింది.
ఈ క్రమంలో కుమార్తెలే వారసులంటూ 2024 డిసెంబర్‌లో తీర్పు వెలువరించింది. అశోక్ కుమార్ దీనిపై సుప్రీంను ఆశ్రయించారు. జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం ఇటీవల వాదనలు వింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థించింది. కుమార్తెలకు వారసత్వ హక్కును నిరాకరించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటివి జరుగుతుంటాయంది. దత్తత స్వీకార పత్రం చెల్లదని స్పష్టం చేసింది. భువనేశ్వర్ సింగ్ ఆస్తికి ఆయన కుమార్తెలే అసలైన వారసులని, అశోక్ కుమార్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.